
అడవి బిడ్డల పురిటి కష్టాలు హృదయవిదారకం: వాగు గట్టుపైనే గర్భిణి ప్రసవవేదన, ఆపై..
శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో అడవిబిడ్డల పురిటికష్టాలు తప్పటం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. చాలా గిరిజన ప్రాంతాలు వరద ముంపుకు గురై తీవ్ర ఇబ్బందులలో గిరిజనులు చిక్కుకున్న పరిస్థితి ఉంది.
టార్గెట్ కేసీఆర్: దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి; బహుముఖ వ్యూహంతో బరిలోకి....తగ్గేదేలే!!

అడవిబిడ్డల వేదన అరణ్య రోదన.. గర్భిణీలకు ఇలాంటి పరిస్థితి
అత్యవసర పరిస్థితులలో ఆసుపత్రికి వెళ్లాలంటే నరకం చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అడవిబిడ్డల వేదన అరణ్య రోదనగా మారింది. ముఖ్యంగా గర్భిణీ మహిళలను ఇటువంటి పరిస్థితులలో ఆసుపత్రికి తీసుకు వెళ్లడం వారికి కత్తి మీద సాములా మారుతోంది. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన హృదయ విదారకమైన ఘటన అడవి బిడ్డల పురిటి కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ పంచాయతీ మామిడిగూడాకు చెందిన గర్భిణీ మహిళ ప్రసవ వేదనతో ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

మామిడిగూడ వాగు దాటుతుండగా గర్భిణీకి పురిటి నొప్పులు.. అక్కడే డెలివరీ
ఆస్పత్రికి వెళ్లాలంటే మామిడిగూడ వాగు దాటి వెళ్ళాలి. కానీ మామిడిగూడ వాగు దాటుతుండగా ఉన్నట్టుండి గర్భిణీ మహిళలకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఆమె వాగు దాటలేని పరిస్థితుల్లో వాగు గట్టుపైనే డెలివరీ అయింది. ఇక ఈ సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది పిట్ట బొంగరం పి.హెచ్.సి వైద్యుడు అశోక్, వాల్గొండ ఏఎన్ఎం జానాబాయి, ఆశ కార్యకర్త మైనాబాయి వాగు దాటి మహిళ ప్రసవించిన చోటుకు వెళ్ళి, గ్రామస్థుల సహాయంతో తల్లి, బిడ్డలను వాగు దాటించారు.

బాలింత ఆస్పత్రికి వెళ్ళటానికి ఒకటిన్నర కిలోమీటర్లు నడవాల్సి ఉంది
అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన సదరు బాలింత ఆసుపత్రికి వెళ్లడానికి ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ఆపై అక్కడినుండి అంబులెన్స్ లో ఇంద్రవెల్లి పీహెచ్సీకి బాలింతను తరలించారు. ఇప్పటికీ అనేక మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయాలు లేకపోవడం, దగ్గరలో ఆసుపత్రులు లేకపోవడం, వారికి సమయానికి ఎటువంటి వైద్య సహాయం అందకపోవడం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అనేక చోట్ల కనిపిస్తుం

గర్భిణీ మహిళలు పడుతున్న ప్రసవవేదన కంటే మౌలిక సదుపాయాల లేమి అతి పెద్దసమస్య
ముఖ్యంగా గర్భిణీ మహిళలు పడుతున్న ప్రసవవేదన కంటే, మౌలిక సదుపాయాలు లేక పడుతున్న కష్టాలు వారికి కన్నీరు తెప్పిస్తున్నాయి. శక్తి లేకున్నా, శక్తినంతా కూడదీసుకుని ఆసుపత్రులకు కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితులు, డోలీలు కట్టి తీసుకు వెళ్లాల్సిన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ఇదేనా మనం సాధించిన అభివృద్ధి అని ప్రశ్నించేలా చేస్తున్నాయి.