వర్క్ ఫ్రం హోం చిచ్చు : చచ్చిపోవాలన్న భార్య, సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
వరంగల్: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లిలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య, అత్తామామ వేధింపులు భరించలేక ఓ సాఫ్ట్‌వేర్ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన కొండా రాకేష్(28) హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన దేవులపల్లి నిహారిక(24)తో వివాహమైంది. కొద్ది నెలలపాటు సజావుగా సాగిన వీరి కాపురంలో వర్క్ ఫ్రం హోం నిప్పులు పోసింది. భార్య నిహారికకు పల్లెటూరులో ఉండటం ఇష్టంలేక హైదరాబాద్ కు వెళ్దామని భర్తతో చెప్పగా.. వర్క్‌ఫ్రం హోం పూర్తికాగానే వెళ్దామన్నాడు.

ఈ విషయంలో మనస్పర్థలు రావడంతో నిహారిక పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేగాక, నిహారిక ఐదు నెలల గర్భవతి కూడా. అయితే, కొద్ది రోజుల కిందట వీడియోకాల్ చేసి భర్త రాకేష్‌ను చనిపోవాలని, అప్పుడే తాను మరొకరిని పెళ్లి చేసుకుంటానని నిష్టూరంగా చెప్పింది నిహారిక.
మరోవైపు, అత్తామామలు కూడా సూటిపోటీ మాటలు అనడంతో మనస్తాపం చెందిన రాకేష్.. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు సూసైడ్‌నోట్ లో పేర్కొన్నాడు. మృతుడి భార్యతోపాటు అత్తామామ అరుణ, శంకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications