జూబ్లీహిల్స్‌లో ఘోరం: వాచ్‌మెన్ నాలుగో అంతస్తు నుంచి తోసేశారు, మృతి
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ ఇంద్రనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాఘవ గెస్ట్‌హౌస్ లాడ్జీలో మద్యం మత్తులో నలుగురు డ్యాన్సర్లు వాచ్‌మెన్‌ను నాలుగో ఫ్లోర్ నుంచి తోసేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన వాచ్‌మెన్ యాదగిరి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 20న షూటింగ్ నిమిత్తం చెన్నై నుంచి వచ్చిన నలుగురు డ్యాన్స్‌ర్లు రాఘవ గెస్ట్ హౌస్ లాడ్జిలో రూం బుక్ చేసుకుని ఉంటున్నారు. అయితే ఏప్రిల్ 27వ తేదీ గురువారం అర్థరాత్రి నలుగురు డ్యాన్సర్లు మద్యం మత్తులో హోటల్ సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో సిబ్బంది విషయాన్ని వాచ్‌మెన్ యాదగిరికి తెలియజేశారు.

యాదగిరి వచ్చి వారిని అదుపు చేసే ప్రయత్నం చేశాడు. అయినా వినని డ్యాన్సర్లు.. యాదగిరితోనూ వాగ్వాదానికి దిగారు. ఇదే క్రమంలో కోపోద్రోక్తులైన ఆ డ్యాన్సర్లు యాదగిరిని మూడో ఫ్లోర్ నుంచి నెట్టివేశారు. దీంతో యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ యాగిగిరి మరణించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. మణి, దిన అనే ఇద్దరు డ్యాన్సర్లను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు నరేష్, నాగరాజు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం గాలింపు చేపట్టారు. యాదగిరి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. యాదగిరి మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని యాదగిరి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా, మణి అనే డ్యాన్సర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సైడ్ డ్యాన్సర్‌గా పనిచేసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications