వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి భర్త హత్య
నల్గొండ: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అజ్మాపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు కథనం ప్రకారం... అజ్మాపురం గ్రామానికి చెందిన కావలి ఏసు (38) మొదటి భార్య మృతి చెందడంతో తిరిగి కంబాలపల్లి గ్రామానికి చెందిన పద్మను రెండో వివాహం చేసుకున్నాడు.
కాగా, అదే గ్రామానికి చెందిన మస్క యాదయ్యతో పద్మ కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలుసుకున్న ఏసు ఇటీవల భార్యను మందలించాడు. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడికి తెలిపింది. దీంతో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ఆమె ప్రియుడు, అతని స్నేహితుడు చంద్రయ్యతో కలిసి ఫిబ్రవరి 27న గ్రామ శివారులో ఏసును హత్య చేశారు.

అనంతరంగా ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో మృతదేహాన్ని రాళ్లు కట్టి వదిలేశారు. దీంతో దుగ్యాల సమీపంలోని ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో మృతదేహం తెలియాడింది. కాల్వలో కొట్టుకుపోతున్న మృతదేహాన్ని చూసిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించడంతో ముందుగా గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు భావించారు.
కానీ ఏసు కనిపించడం లేదని తెలుసుకున్న బంధువులు వచ్చి చూడగా అది ఆయన మృతదేహంగా గుర్తించారు. మృతుడి గొంతు, దవడపై బలమైన గాయాలు ఉండడంతో గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. దేవరకొండ డిఎస్పీ చంద్రమోహన్, దేవరకొండ రూరల్ సీఐ వెంకటయ్య సంఘటన స్థలాన్ని సందర్శించారు.
మృతుడి భార్య పద్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతుడి మొదటి భార్య కూతురు సైదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications