మర్మాంగాన్ని కోసి.. చిత్రహింసలు పెట్టి యువకుడి దారుణహత్య.. వికారాబాద్ జిల్లాలో ఘటన
వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలో ఓ యువకుడిని చిత్రహింసలకు గురి చేసి దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఓ యువకుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి మర్మాంగాన్ని కోసి, గొంతు కోసి హతమార్చిన ఘటన కలకలం రేపింది.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం బీచిగానిపల్లి గ్రామానికి చెందిన 19 సంవత్సరాల యుగేంద్ర అనే యువకుడు మర్మాంగాలను, గొంతును కోయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి మృతిచెందాడు. అయితే అతనిని హతమార్చిన వారెవరు? వారి మధ్య వాగ్వాదానికి దారి తీసిన కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. యువకుడి హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం బీచిగానిపల్లి గ్రామానికి చెందిన శివప్ప కుమారుడు యుగేంద్ర (19) పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో కుటుంబంతో సహా నివాసముంటున్నాడు. యుగేంద్ర నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో హౌస్ పెయింటర్‌గా పనిచేస్తూ తన తండ్రికి సహకారాన్ని అందిస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. గత శనివారం పని ముగించుకుని ఇంటికి వచ్చిన యుగేంద్ర రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ఫోన్ కాల్ రావడంతో అక్కడి నుంచి బయటకు వెళ్లాడు.
కొడుకు ఎప్పటిలాగే స్నేహితులతో ఉండి ఉంటాడని తల్లిదండ్రులు భావించారు. కానీ కుమారుడు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ కొడుకు చివరిగా కనిపించిన ప్రాంతంలో వెతికారు. అయితే ఆదివారం నాడు గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో యుగేంద్ర మృతదేహం కనిపించింది. కొడుకు మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. యుగేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటు యుగేంద్రను హతమార్చిన వారు ఎవరు అనేది తల్లిదండ్రులకు కూడా అంతుచిక్కడం లేదు. యుగేంద్ర ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications