నోటుకు ఓటు: స్టీఫెన్‌సన్ వాంగ్మూలం తర్వాత ఎసిబి దూకుడు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన తర్వాత ఎసిబి దూకుడు పెంచే అవకాశాలున్నాయని అంటున్నారు. వ్యవహారంతో సంబంధం ఉన్నవారికి నోటీసులు జారీ చేయడం, మరిన్ని అరెస్టులు చేయడం వంటి చర్యలకు దిగవచ్చునని చెబుతున్నారు.
కేసులో స్టీఫెన్‌సన్ వాంగ్మూలం కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన వాంగ్మూలంలో స్టీఫెన్ ఎవరి పేర్లు చెబుతారు, ఏ విషయాలు చెబుతారనేది ఆసక్తిగా మారింది. స్టీఫెన్‌సన్, రేవంత్ రెడ్డి మధ్య చోటు చేసుకున్న సంభాషణల్లో బాస్ అనే పదం చోటు చేసుకోవడం, ఆ తర్వాత మీడియాకు విడుదలైన టేపుల్లోఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్లు చెప్పే ఆడియో టేపులు వంటివాటిపై ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి.

సినిమా ఇంకా ముందుంది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు కేసును ఆసక్తికరంగా మార్చాయి. గవర్నర్‌తో తరుచుగా పోలీస్ అధికారులు భేటీ అవుతున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ కూడా కీలకమైందని భావిస్తున్నారు.
విచారణలో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహా నుంచి సేకరించిన సమాచారం (ప్రొసీడింగ్స్)పై సమగ్ర నివేదికను దర్యాప్తు అధికారులు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక సమాచారం ఇందులో ఉన్నట్లు సమచారం.
ముడుపుల కేసులో రేవంత్, సహనిందితుల్ని అరెస్ట్ చేసిన సమయంలో చిత్రీకరించిన వీడియో, ఫోన్ రికార్డింగ్‌కు సంబంధించిన మొత్తం 14 టేపులు, ఐ ఫోన్లు, సోదాల్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌ను ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఎఫ్‌ఎస్‌ఎల్(ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ)కి పంపించారు. ఫింగర్‌ప్రింట్స్ తరహాలోనే వాయిస్ రికార్డింగ్ టేపులనూ ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు సాంకేతికంగా పరిశీలిస్తారు.












Click it and Unblock the Notifications