అమెరికాలో ఘోర ప్రమాదం: తెలంగాణ దంపతులు, ఏపీ వ్యక్తి దుర్మరణం, ఒంటరైన చిన్నారి
హైదరాబాద్: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో హైదరాబాద్ నగరానికి చెందిన భార్యాభర్తలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి ఉన్నారు. ఈ వార్త బాధితుల కుటుంబాల్లో విషాదం నింపింది.

కూతుర్ను డ్యాన్స్ క్లాసు వద్ద..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముషీరాబాద్ గాంధీనగర్‌కు చెందిన రాజా గవిని(41), దివ్య ఆవుల(34) భార్యాభర్తలు. వీరిద్దరూ అమెరికా టెక్సాస్‌లోని ప్రిస్కోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో భారత కాలమాన ప్రకారం.. సోమవారం ఉదయం తమ కుమార్తె రియాను డ్యాన్స్ క్లాస్ వద్ద విడిచి పెట్టారు.

స్నేహితుడ్ని తమ వెంట..
అనంతరం అక్కడ్నుంచి తిరిగి వస్తున్న క్రమంలో స్థానికంగా నిర్మాణం చేపట్టిన తమ సొంత ఇంటిని పరిశీలించేందుకు విజయవాడకు చెందిన స్నేహితుడు ప్రేమ్‌నాథ్ రామనాథం(42)ను కూడా తమ వెంట కారులో తీసుకెళ్లారు.

ట్రక్ వేగంగా ఢీకొట్టడంతో..
ఈ క్రమంలో ఎఫ్ఎం 423 ఇంటర్ సెక్షన్ వద్దకు రాగానే ఈ ముగ్గురూ వెళ్తున్న కారును ఓ ట్రక్ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఈ ముగ్గురూ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై సమాచారం తెలియడంతో ఆ తెలుగు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Recommended Video


ఆనందంగా సాగుతున్న జీవితంలో.. ఒంటరైన చిన్నారి
తల్లిదండ్రులు రాజా, దివ్యల మృతితో రియా ఒంటరిగా మారిపోయింది. అమెరికాలోనే స్థిరపడి ఇల్లు కూడా కట్టుకుంటున్న దంపతులు.. ఎంతో ఆనందంగా జీవితం గడిచిపోతుందనుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం పెను విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదం మూడు తెలుగు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.












Click it and Unblock the Notifications