Electricity: తలసరి విద్యుత్ వినియోగంలో 10వ స్థానంలో తెలంగాణ..!
తలసరి విద్యుత్(Electricity) వినియోగంలో తెలంగాణ 10వ స్థానంలో ఉందని టీజేఏసీ పేర్కొంది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించింది. కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక 2023 ప్రకారం కరెంట్ తలసరి వినియోగంలో మన రాష్ట్రం కంటే 6 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు ముందు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగానికి సంబంధించిన లెక్కలను టీజేఏసీ మీడియాకు విడుదల చేసింది.
తలసరి విద్యుత్ వినియోగంలో గోవా మొదటి స్థానంలో ఉండగా, పంజాబ్, ఒడిశా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయని టీజేఏసీ పేర్కొంది. తర్వాత గుజరాత్, చత్తీస్ గఢ్, హర్యానా, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయని ప్రకటించింది. కేంద్రపాలితా ప్రాంతాలు చూసినట్లయితే దాద్రా నగర్ హవేలీ, డామన్డయ్యూ, పుదుచ్చేరి తెలంగాణ కంటే ముందున్నాయని తెలిపింది. వీటన్నింటితో పోలిస్తే తెలంగాణ10వ స్థానంలో నిలిచిందని టీజేఏసీ స్పష్టం చేసింది. 2021-22 ఏడాదికి గాను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా నివేదికను విడుదల చేసినట్లు పేర్కొంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కన్నా విద్యుత్ వినియోగ వృద్ధి రేటు దిగజారిందని టీజేఏసీ గుర్తు చేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మెరుగైనట్టు కన్పిస్తున్నా..2015 తర్వాత దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా మెరుగుపడిందని టీజేఏసీ స్పష్టం చేసింది. దేశంలో గతంలో మొదలుపెట్టిన పవర్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికావడంతో కరెంట్ సప్లై పెరిగిందని, బొగ్గు సరఫరా కూడా పెరగడంతో కరెంట్ సమస్యలు తీరాయని వివరించింది.
ప్రస్తుతం దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా సమస్యలు, కరెంటు కోతలు లేవని జేఏసీ పేర్కొంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కరెంటును కొనగలిగితే ఏ రాష్ట్రానికీ విద్యుత్ కొరత ఉండే అవకాశం లేదని వెల్లడించింది. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం వచ్చాక నంబర్ వన్ అయ్యామంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నదని ఆరోపించింది. కొత్త పవర్ ప్రాజెక్టులు ఏవీ పూర్తికాలేదని, కొనుగోళ్లకే పరిమితం కావడంతో డిస్కంలు అప్పుల పాలయ్యాయని టీజేఏసీ పేర్కొంది.












Click it and Unblock the Notifications