అందుకే కెసిఆర్‌ని పిలిచా: బాబు, మోడీ ఆ హామీ నిలబెట్టుకుంటారా?
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తాను ఎందుకు ఆహ్వానించాననే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం చెప్పారు. ఇరు రాష్ట్రాలు సామరస్యంగా వెళ్లాలనేదే తన ఉద్దేశ్యమని చెప్పారు.
ప్రభుత్వాలు వేరని, తెలుగు జాతి అంతా ఒకటేనని, సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయని, వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని, విభజన సమయంలో ఎలాగూ నష్టపోయామని, ఇప్పడు విభేదాలు చూపుకుంటూ ముందుకెళ్లడం ద్వారా రెండు రాష్ట్రాలకూ నష్టమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
సానుకూల దృక్పథంతో వెళ్లాలన్నదే నా కోరిక అని, అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శంకుస్థాపన ఉత్సవాలకు ఆహ్వానించానని, తెలంగాణకు ఇచ్చింది తిరిగి ఇవ్వాలని నేను ఎన్నడూ కోరలేదని, విభజన తరువాత ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.
తెలంగాణకు నష్టం చేయాలన్న ఉద్దేశం తనకేమాత్రమూ లేదన్నారు. అమరావతికి రావాలని కేసీఆర్ దగ్గరకు పిలుపులకు వెళ్లిన సమయంలో రెండు ప్రభుత్వాలూ అభివృద్ధి దిశగా ఎలా ముందుకు సాగాలన్న విషయాన్నే ప్రధానంగా చర్చించినట్టు చంద్రబాబు తెలిపారు.

మోడీ హామీ నిలబెట్టుకుంటారా?
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తానని గత ఏడాది ఏప్రిల్ 30న తిరుపతి ఎన్నికల ప్రచార సభలో ప్రకటించిన మోడీ... ఆ మాటను నిలబెట్టుకొనేందుకు తప్పకుండా ప్యాకేజీ ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ అరుదైన కార్యక్రమాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ వినిపించిన డిమాండ్లపై కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులతో చర్చలు జరుపుతుండటం ప్యాకేజీ ప్రకటనకు బలం చేకూరుస్తోంది.
విషయాలు బయటకు పొక్కకపోయినా అత్యున్నత స్థాయిలో జరుగుతున్న ఈ చర్చల తీరును బట్టి సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పదహారు నెలల క్రితం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ దేశంలోని మిగతా రాష్ట్రాలతో సమాన స్థాయికి చేరుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని సీఎం చంద్రబాబు పదేపదే కోరుతున్నారు.












Click it and Unblock the Notifications