భారతదేశంలోనే అత్యంత ప్రత్యేకమైన 'అహింసా స్తంభం' మన హైదరాబాద్ లో.. విశేషాలివే!
అహింసే పరమ ధర్మం అని చెప్తారు. హింసాయుత మార్గంలో ప్రయాణం మంచిది కాదని, అహింసా భావనతో ముందుకు నడవాలని చిన్నప్పటి నుండి వింటున్నాం. అటువంటి అహింసా మార్గాన్ని గుర్తు చేయటానికి, శాంతి సందేశం ఇవ్వటానికి హైదరాబాద్ లో ఒక కొత్త ఆవిష్కరణ జరిగింది. హైదరాబాద్ మియాపూర్ లో భారతదేశంలోనే మొట్టమొదటి 'అహింసా స్తంభం' ఆవిష్కృతమైంది.
మియాపూర్ లోని వైశాలి నగర్ లో అహింసా స్థంభం
ఈ అహింసా స్థంభం లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మియాపూర్ లోని వైశాలి నగర్ లో నిర్మించిన ఈ అహింసా స్థంభం భారతదేశం యొక్క ప్రాచీన సంస్కృతిని , శాంతియుత సహజీవనాన్ని చాటేలా దీనిని రూపొందించారు. జైనమత 24వ తీర్థంకరుడు అయిన భగవాన్ మహావీరుని ప్రధాన సిద్ధాంతమైన అహింస, శాంతి మరియు జీవ కారుణ్య సందేశాలను భవిష్యత్తు తరాలకు అందించేలా ఈ అహింస స్తంభాన్ని రూపొందించారు.

హైదరాబాద్ గడ్డపై అహింసా స్తంభం ఏర్పాటు కావడం గర్వ కారణం:కిషన్ రెడ్డి
ఈ అహింసా స్థంభ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి హైదరాబాద్ గడ్డపై ఈ స్తంభం ఏర్పాటు కావడం గర్వకారణమని పేర్కొన్నారు. జైన్ సమాజ మహిళలు ఈ బృహత్తర కార్యానికి నాయకత్వం వహించడాన్ని ఆయన అభినందించారు. అహింస మన బలహీనత కాదని, అత్యున్నత బలమని స్పష్టం చేశారు.
వైవిధ్యం వారసత్వ సంపద నగర పురోగతికి దోహదం
హైదరాబాద్ వివిధ సంస్కృతుల సంగమ క్షేత్రమని, ఇక్కడి వైవిధ్యం మరియు వారసత్వ సంపద నగర అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలను సంఘర్షణలు మరియు హింస ప్రభావితం చేస్తున్న ప్రస్తుత తరుణంలో, పరస్పర గౌరవం, సామరస్యం మరియు శాంతియుత సహజీవనం గురించిన ఈ సందేశం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళల నేతృత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు.
'వికసిత్ భారత్' సాధనలో సాంస్కృతిక మూలాలు కీలకమన్న కేంద్రమంత్రి
జెన్-జీ యువత టెక్నాలజీతో ప్రపంచాన్ని జయిస్తూనే భారతీయ సంస్కారాలను, విలువలను కాపాడుకోవాలని కోరారు. హైదరాబాద్ ఆర్థిక, సామాజిక ప్రగతిలో జైన్, మహేశ్వరీ సహా పలు విభిన్న సమాజాల పాత్ర ఉందన్నారు. 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధనలో సాంస్కృతిక మూలాలు కీలకమని పేర్కొంటూ, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను ఐక్యతతో ఓడించాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications