ఏఐ అంటే ఎనుముల ఇంటెలిజెన్స్: రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు జాతీయ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై మండిపడ్డారు. రుణమాఫీ చేసినట్లు ఇచ్చిన ప్రకటనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రూపొందించిన చిత్రాన్ని వాడారని, రైతుల లెక్కల విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి అదే టెక్నిక్ వాడారంటూ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న 40 లక్షలు అనే సంఖ్యను సీఎం రేవంత్ రెడ్డి (AI) అంటే ఎనుముల ఇంటెలిజెన్స్ తో రూపొందిందేనని కేటీఆర్ సెటైర్లు వేశారు. నిజానికి తెలంగాణలో ఇప్పటి వరకు రైతు రుణాలు 40 శాతం కూడా మాఫీ కాలేదని చెప్పారు. కానీ, తరచూ నిబంధనలతోపాటు రుణమాఫీ తేదీలను మారుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం, నియోజకవర్గంలోనూ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ విషయంలో అబద్ధాలు, బూటకపు ప్రచారాలు మాత్రం ఆగడం లేదని కాంగ్రెస్ సర్కారు మండిపడ్డారు. రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కూడా కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు మరో ఉద్యమం రావాల్సిందేనని అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన ఆలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి.. ఇప్పుడు ప్రజలను గోసపెడుతోందని హరీశ్ రావు విమర్శించారు.
మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. రుణమాఫీ, రైతుభరోసా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి. చీఫ్ మినిష్టర్ కాదు.. చీటింగ్ మ్యాన్ అంటూ హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదని హరీశ్ రావు అన్నారు. జీవో 29 రద్దు చేయడమే గ్రూప్ 1 సమస్యకు పరిష్కారమన్నారు.












Click it and Unblock the Notifications