టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆయనే.. ఆసక్తికర చర్చ!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాలనలో సరికొత్త నిర్ణయాలతో ముందుకు వెళుతుంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటినుండి ప్రజా సంక్షేమం కోసం పారదర్శక పాలన చేపట్టాలని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు చెప్పిన ఆరు హామీలను నెరవేర్చడం కోసం ప్రజా పాలన అభయహస్తం దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియను చేపట్టి అర్హులైన వారందరికీ పథకాలను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని లోపాలను, జరిగిన అవకతవకల పైన కూడా దృష్టి సారించి దానిపైన విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. అంతే కాదు గత ప్రభుత్వ హయాంలో టిఎస్పిఎస్సి లో చోటు చేసుకున్న ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల స్థానంలో కొత్తవారిని నియమించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఆమోదం తెలుపగా కొత్త చైర్మన్ ఎవరు అన్న దానిపైన ఇప్పుడు రాజకీయ, మేధావి వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. టిఎస్పిఎస్సి చైర్మన్ గా ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించే మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే ఆకునూరు మురళి గత ప్రభుత్వం పై పెద్ద ఎత్తున యుద్ధం చేశారు. రాష్ట్రంలోని అనేక సమస్యలపై ఆయన పోరాటం చేశారు. గతంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో ఆయన అనేక సందర్భాల్లో ప్రజలకు తెలిసేలా చేశారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు.
ఇక గత ఎన్నికలలో బీఆర్ఎస్ కు ప్రజలు బైబై చెప్పటంతో పాలనా పగ్గాలు పట్టిన కాంగ్రెస్ పార్టీకి అనునిత్యం సోషల్ మీడియా వేదికగా అనేక సూచనలు ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలు ఏమిటి? వారి అవసరాలు తెలుసుకుని ప్రభుత్వం చేయవలసింది ఏమిటి? అనేది ఆయన చాలా చక్కగా సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు.
ఇక ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళికి అవకాశం ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం పలువురు రాజకీయవేత్తలు, ప్రజలలో వ్యక్తం అవుతుంది.ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా సమర్ధుడు, నిజాయితీపరుడు అయిన ఆకునూరి మురళిని నియమించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి యుపిఎస్సి చైర్ పర్సన్ తో భేటీ అయ్యారు. త్వరలోనే రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం కూడా చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications