అల్లు అర్జున్ కేసులో కొత్త చర్చ.. వారికి పోలీసుల సీరియస్ వార్నింగ్!
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్టు కావడంతో మొదలైన రగడ చిలికి చిలికి గాలి వానగా మారుతుంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట తదనంతర పరిణామాలపైన సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి.
సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు సీరియస్
ఎవరికి తోచినట్టు వారు ఘటనపైన పోస్టులు పెడుతూ ఉండడంతో పోలీసులు ప్రజలను అపోహలకు గురి చేసేలాగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల కొందరు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రాకముందే తొక్కిసలాట ఘటన జరిగినట్టు అల్లు అర్జున్ థియేటర్లోకి రాకముందే ఆమె చనిపోయినట్టు సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్
ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలపైన హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను అపోహలకు గురి చేసేలా తప్పుడు సమాచారాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేస్తున్న క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీస్ శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిందన్నారు.
ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు
పోలీసులు ఘటనపై స్పష్టత ఇచ్చినప్పటికీ కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించే లాగా సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేస్తున్నారని వారు అన్నారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ఈ కేసులో పోలీసుల నిబద్దత ప్రశ్నించేలా అసత్య ప్రాచారాలా?
తొక్కిసలాట జరిగిన తర్వాత పరిణామాలపై పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణిస్తామని, ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడు ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతుందని పోలీసులు ప్రకటించారు. ఇక పోలీసుల నిబద్ధతను ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు అభూత కల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించబోమని హెచ్చరికలు జారీ చేశారు.
ఆధారాలుంటే పోలీస్ శాఖకు అందించాలని సూచన
అంతేకాదు ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గర అయినా ఆధారాలు అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చని పేర్కొన్నారు. సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేశారు. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications