Pushpa2: సంధ్య థియేటర్ ఘటనలో వారూ సేఫ్-హైకోర్టు కీలక ఆదేశం..!
గతేడాది డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ రావడంతో చోటు చేసుకున్న తోపులాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడు. కానీ ఈ ఘటనకు కారకులైన ఒక్కొక్కరికీ వరుసగా ఊరట లభిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఎ11గా ఉన్న అల్లు అర్డున్ ను అరెస్టు చేయకుండా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూర చేయగా.. ఇప్పుడు మరికొందరికి ఊరట లభించింది.
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తోపులాట ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంతో ఆయన హైకోర్టుకు వెళ్లి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. అలాగే అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. అదే సమయంలో పుష్ప 2 చిత్ర నిర్మాతలు అయిన నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ తమపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు..వారిని అరెస్టు చేయొద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగించవచ్చని, కానీ వీరిని అరెస్టు మాత్రం చేయొద్దని పోలీసులకు సూచించింది. అదే సమయంలో పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని నిందితులుగా ఉన్న పుష్ప 2 నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ కు హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు తోపులాట ఘటనలో తమకూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ సంధ్య థియేటర్ మేనేజర్ అడ్ల శరత్ చంద్రనాయుడు, అల్లు అర్జున్ వర్సనల్ సిబ్బంది దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణను ఈ నెల 6న చేపట్టేందుకు హైకోర్టు అంగీకరించింది. దీంతో వీరికి కూడా ఈ కేసులో ఊరట దక్కుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications