బీజేపీ పావులు: ఏపీలో చక్రం, తెలంగాణపై బడా ప్లాన్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ అధ్యక్షులు అమిత్ షా తెలుగు రాష్ట్రాల పైన కూడా ప్రత్యేకంగా కన్నేశారు. ఉత్తరాదిన పట్టు ఉన్న ఆ పార్టీకి దక్షిణాదిన మాత్రం అంతగా లేదు. గతంలో అధికారాన్ని చవి చూసిన కర్నాటకలో తదుపరి ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గట్టి పట్టు లేదనే చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీ, తెలంగాణలలో కీలకంగా ఎదగాలని బీజేపీ పావులు కదుపుతోంది. తెలంగాణ రావడంలో బీజేపీ పాత్ర మరువలేనిది. అలాగే, ఏపీకి హోదా, ఇతర ప్రయోజనాల హామీల విషయమై కూడా బీజేపీ పోరాడింది.
తెరాసని అక్కడ మెచ్చుకొని, అంతలోనే తిట్టిన పారికర్
కానీ, ఇప్పుడు ప్రత్యేక హోదా చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దానిని సూటిగా ప్రజలకు చెప్పి, ఏపీలో ఎదగాలని భావిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడటం ద్వారా 2019 ఎన్నికల నాటికి ప్రతిపక్షంగా నిలబడాలని భావిస్తోంది.

దోస్తీతో ఉంటూనే..
ఏపీ, తెలంగాణల్లో ఉన్న ప్రభుత్వాలతో బీజేపీకి మంచి సంబంధాలే కనిపిస్తున్నాయి. ఏపీలో బీజేపీ - టీడీపీలు పొత్తులో ఉన్నాయి. కేంద్రంలో టిడిపి నేతలు, ఏపీలో బీజేపీ నేతలు మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ విషయానికి వస్తే తెరాస - బిజెపి (కేంద్రం) మధ్య మంచి సంబంధాలే కనిపిస్తున్నాయి.
తెరాస కేంద్రంలో చేరుతుందని, ఎవరికైనా కేంద్రమంత్రి పదవి వస్తుందనే వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లోను స్థానిక బీజేపీ నేతలు ప్రభుత్వాల పైన మండిపడుతున్నారు. కానీ పైస్థాయిలో మాత్రం మంచి సంబంధాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఏపీలో స్థానిక బీజేపీ నేతలు.. మిత్రపక్షం అయినప్పటికీ చంద్రబాబు పాలన పైన విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. టిడిపి నేతలు కేంద్రాన్ని టార్గెట్ చేసినప్పుడల్లా వారు లెక్కలు చెప్పాలని, పోలవరం ప్రాజెక్టులో అవినీతి అంటూ పలు ఆయుధాలు బయటకు తీస్తున్నారు.
తెలంగాణలో బీజేపీ - తెరాసలు అధికార, ప్రతిపక్షాలుగా ఉన్నాయి. దీంతో, స్థానిక బీజేపీ నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. దానికి తెరాస నేతలు కౌంటర్ కూడా ఇస్తున్నారు. కానీ, పైస్తాయికి వెళ్తే మాత్రం బాగానే ఉందని అంటున్నారు.
ఏపీలో టిడిపి మిత్రపక్షం కాబట్టి పైస్థాయిలో బాగా ఉంటూనే... కిందిస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశలో బీజేపీ ముందుకు పోతోంది. ఓ వైపు చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా విపక్ష నేతలను చేర్చుకుంటున్నారు. తద్వారా తన బలం పెంచుకుంటున్నారు.
ఆపరేషన్ ఆకర్ష్‌ను తప్పుపడుతున్న స్థానిక బీజేపీ... వార్డు, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏపీలో బీజేపీకి అంతగా పట్టు లేదు. 2019 నాటికి ప్రతిపక్షం స్థాయికి ఎదగాలని బీజేపీ భావిస్తోంది. అధిష్టానం కూడా అదే కోరుకుంటోంది. లేదా, అప్పటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియవు కాబట్టి.. కీలక పాత్ర పోషించాలని భావిస్తోంది.
పైస్థాయిలో బాగున్నప్పటికీ.. కిందిస్థాయిలో టిడిపికి ధీటుగా ఎదగాలని ఢిల్లీ నేతలు స్థానిక బీజేపీ నేతలకు సూచించారని అంటున్నారు. పార్టీ బలోపేతం విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని అంటున్నారు. తెలంగాణలో విపక్షమైనప్పటికీ.. మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలకు కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు అధిష్టానం పచ్చ జెండా ఊపిందంటున్నారు.
ఇటీవల కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, మనోహర్ పారికర్ తదితరులు తెలుగు రాష్ట్రాలలో పర్యటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా వచ్చారు. ఈ సందర్భంగా వారి వ్యాఖ్యలను చూస్తేనే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లుగా అర్థమవుతోందని అంటున్నారు. ప్రభుత్వాలపరంగా కేంద్రం స్థాయిలో బాగున్పప్పటికీ.. అధికార పార్టీలకు ధీటుగా ఎదగాలని స్థానిక బీజేపీ నేతలకు అధిష్టానం సూచించింది.
2019 ఎన్నికల్లో 119 సీట్లకు గాను 60 సీట్లు గెలుచుకోవాలని తెలంగాణ బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి ఎండగట్టాలని బీజేపీ తెలంగాణ నేతలు నిర్ణయించారు.
గోవాలో కొన్నేళ్ల క్రితం బీజేపీ మైనర్ పార్టీ అని, ఆ తర్వాత ఎదిగిందని, ఇప్పుడు అధికారమే చేపట్టిందని కేంద్రమంత్రి మనోహర్ పారికర్ రెండు రోజుల క్రితం బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో చెప్పారు. తద్వారా తెలంగాణ బీజేపీ నేతల్లో ఉత్సాహం తెప్పించే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్రను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని కూడా ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications