అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్- అదొక్కటే మార్పు
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. అక్టోబర్/నవంబర్‌లల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చు. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.
తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు మిగిలిన చోట్ల కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేస్తోంది.

అటు ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు కమలనాథులు. ఇందులో భాగంగా ఆదివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. .తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. దీనికి రైతు గోస-బీజేపీ భరోసా అని పేరు పెట్టింది బీజేపీ.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1:25 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2:10 నిమిషాలకు కొత్తగూడేనికి వస్తారు. మధ్యాహ్నం 2:55 నిమిషాలకు హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకుంటారు. మధ్యాహ్నం 3:45 నిమిషాలకు రైతు గోస-బీజేపీ భరోసా బహిరంగ సభలో పాల్లొంటారు.
అనంతరం బీజేపీ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ రాష్ట్రస్థాయి నేతలతో చర్చిస్తారు. ఆ తరువాత ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. కాగా- ఈ షెడ్యూల్‌లో చిన్న మార్పు చోటు చేసుకుంది. తన పర్యటన సందర్భంగా అమిత్ షా భద్రాచలం శ్రీసీతారామాచంద్రస్వామివారి ఆలయాన్ని దర్శించాల్సి ఉంది. సమయాభావం వల్ల ఆలయ సందర్శనను రద్దు చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications