ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య సోమవారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాదులోని సోమాజిగుడా యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దాశరథి తుదిశ్వాస విడిచారు. అభ్యుదయ రచయితగా, తెలంగాణ స్వాతంత్ర్య పోరాట యోధుడిగా దాశరథి ప్రసిద్ధులు
దాశరథి స్వస్థలం ఖమ్మం జిల్లా చినగూడూరు. ఆయన 1928లో జన్మించారు. ఆయన మోదుగుపూలు, చిల్లదేవుళ్లు, జనపదం నవలలు రచించారు. ఆయన నాలుగు వేదాలను కూడా తెలుగులోకి అనువదించారు. శ్రీమద్రామయణాన్ని, శ్రీమహాభారతాన్ని సరళ తెలుగులో రాశారు.

ఆయన రాసిన చిల్లర దేవుళ్లు నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అది సినిమాగా కూడా రూపొందింది. తెలంగాణ సామాజిక జీవితాన్ని ఆ నవలలో చిత్రించారు. నవలా రచనలో ప్రజల మనిషి నవల రాసిన వట్టికోట ఆళ్వారు స్వామి వారసుడిగా చెబుతారు.
జీవనయానం పేర ఆయన తన ఆత్మకథను రాశారు. ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యులకు ఆయన సోదరుడు. చాలా కాలంగా దాశరథి రంగాచార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉపాధ్యాయుడిగా, గ్రంథ పాలకుడిగా ఆయన పనిచేశారు. ఆయన నిజాం వ్యతిరేక పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు.












Click it and Unblock the Notifications