'తెలంగాణ ఊటీ' కి వెళ్లొద్దామా..? హైదరాబాద్ కు 60 కి. మీ. దూరంలోనే..
హైదరాబాద్ లో వీకెండ్ వచ్చిందంటే చాలు సినిమాలు, షికార్లు అంటూ బయల్దేరుతారు. కానీ భాగ్యనగరానికి అతి సమీపంలోనే తెలంగాణ ఊటీగా పేరుగాంచిన ఆ ప్రదేశానికి ఎప్పుడైనా వెళ్లారా..? అదే అనంతగిరి హిల్స్ . అనంతగిరి కొండలు ప్రదేశం తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ ప్రాంతం దట్టమైన అడవులకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చాలా విశిష్టత ఉంది. ఈ ఆలయాన్ని స్కంద పురాణం ప్రకారం మార్కండేయుడు నిర్మించినట్లు చెబుతారు. హైదరాబాద్ కు దగ్గర్లోనే ఉండటంతో, వీకెండ్స్ లో నగరం నుండి వందలాది మంది ఇక్కడికి వస్తుంటారు.
నిత్యం వచ్చే పర్యాటకులకు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తున్నాయి ఇక్కడి అనంతగిరి కొండలు . 1200 ఎకరాల్లో ఔషధ వనం పెంపకం జరుగుతోంది. టీబీ వ్యాధికి మందులు లేని రోజుల్లోనే వికారాబాద్- అనంతగిరి కొండలపై కొన్ని నెలల పాటు నివసించి ఇక్కడి గాలి పీల్చుకుంటే టీబీ వ్యాధి తగ్గేదని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అనంతగిరి కొండల మొత్తం విస్తీర్ణం 3,763 ఎకరాలుగా ఉంది. వికారాబాద్ టౌన్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఈ హిల్స్ కనిపిస్తాయి. టూరిస్టుల మనసు దోచేలా వివిధ ఆకృతుల్లో ఉద్యానాలు, ఆట స్థలాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.

ఈ అనంతగిరి హిల్స్ లోని పచ్చదనం, లోయలు, కొండలు, జలపాతాలు చూస్తే ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు. అందుకే సెలవులు, వీకెండ్ రోజుల్లో ఇక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కేవలం 60 కి.మీ. దూరంలో ఉన్న అనంతగిరికి వెళితే సహజసిద్ధ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఎన్నో రకాల వన్యప్రాణులకు, పక్షులకు ఈ ప్రాంతం నెలవైంది. అంతేకాకుండా ఇక్కడి కోటపల్లి ప్రాజెక్టులో బోటు షికారు కూడా చెయొచ్చు. అలాగే అనంతగిరికి వచ్చే పర్యాటకులు బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు.












Click it and Unblock the Notifications