
సీఎం కేసీఆర్ కు యాంజియోగ్రామ్ పూర్తి; ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఏం చెప్పారంటే
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వైద్యపరీక్షల నిమిత్తంవెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. కేసీఆర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన కుమారుడు, మంత్రి కేటీఆర్ కూడా హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు.
Recommended Video
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఈరోజు సీటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. డాక్టర్ ఎన్వి రావు నేతృత్వంలోని వైద్యుల బృందం సీఎం కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించింది. సీఎం కేసీఆర్ గత రెండు రోజుల నుంచి వీక్ గా ఉన్నారని, ఎడమ చేయి లాగుతుంది అని చెప్పారని వైద్యులు వెల్లడించారు. అందుకే ఆయనకు ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ ఎన్వి రావు పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు ఆయన ఆరోగ్యంపై ప్రకటన చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కు యాంజియోగ్రామ్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ రిపోర్టులో ఆయనకు నార్మల్ వచ్చింది. సీఎం కేసీఆర్ కు గుండె సంబంధిత సమస్యలు లేవని వైద్యులు నిర్దారించారు. సీఎం కేసీఆర్ వీక్ గా ఉండడంతో దానికి సంబంధించి చికిత్స అందించనున్నారు. మరో 4 గంటల పాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండనున్నారు. ఆయన ఆరోగ్యంపై స్పందించిన వైద్యులు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని,ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో సీఎం కు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఆయన కాస్త బలహీనంగా ఉండటంతోనే పరీక్షలు చేసినట్టు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఈ రోజు సీఎం కేసీఆర్ యాదాద్రి లో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తిరు కల్యాణోత్సవ వేడుకలకు హాజరుకావాల్సి ఉంది. సీఎం కేసీఆర్ యాదాద్రి స్వామి తిరు కల్యాణోత్సవ వేడుకలకు హాజరవుతారని ఈవో గీత వెల్లడించారు. కానీ ఆయన అస్వస్థతకు గురవడంతో కేసీఆర్ యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన రద్దు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.