మావోయిస్టులకు మళ్ళీ షాక్.. మరో భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మృతి!
మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఇటీవల చత్తీస్ గడ్ లోని దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా నేడు మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరో ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లకు గాయాలు అయినట్టు సమాచారం.
నేడు మావోయిస్టులకు, గ్రేహౌండ్స్ దళాలకు మధ్య ఎదురుకాల్పులు
పినపాక నియోజకవర్గం లోని కరకగూడెం మండలం సరిహద్దుతో పాటు, ములుగు జిల్లా సరిహద్దులో ఉన్న రఘునాథపల్లి దామెరతోగు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఈరోజు తెల్లవారుజామున ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల దళసంచారం గురించి సమాచారం తెలుసుకున్న తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు చేపట్టిన గాలింపు చర్యలలో మావోయిస్టు దళం ఎదురుపడింది.

ఆరుగురు మావోయిస్టులు మృతి, ముగ్గురు జవాన్లకు గాయాలు
దీంతో తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఇందులో ఒక దళ కమాండర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఎదురు కాల్పులలో ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులకు గాయాలైనట్టుగా చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అక్కడ పరిస్థితిని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన గ్రేహౌండ్స్ పోలీసులను చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు.
మొన్ననే ఎన్కౌంటర్
ఇక మృతి చెందిన వారి మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో కూడా దంతెవాడ జిల్లాలోని లోహగావ్ లోని అండ్రి గ్రామం పురంగెల్ అడవుల్లో 40 మంది వరకు మావోయిస్టులు ఉన్నారని తెలుసుకొని కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఇక మావోయిస్టులు ఈ ఆపరేషన్ లో ఎదురుపడగా మూడు గంటల పాటు ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి.
లచ్చన్న దళానికి చెందినవారిగా గుర్తింపు
ఈ ఘటనలో ఆరుగురు మహిళలతో సహా తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరు పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ 2 సౌత్ బస్తర్ కు చెందిన వారిగా గుర్తించారు. ఇక తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన వారు లచ్చన్న దళానికి చెందినవారుగా సమాచారం.












Click it and Unblock the Notifications