వైఎస్ షర్మిల వెంటే విజయమ్మ: లోటస్‌పాండ్ ఇంట్లో బర్త్‌డే: ఫోన్ ద్వారా జగన్ పలకరింపు
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య, తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన షర్మిల తల్లి విజయమ్మ.. తన కుమారుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనూహ్యంగా షాక్ ఇచ్చారు. తన పుట్టినరోజు వేడుకలను ఆమె కుమార్తె వద్దే జరుపుకొన్నారు. ఈ ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని లోటస్‌పాండ్ నివాసంలో ఆమె జన్మదిన వేడుకలను నిర్వహించారు. వైఎస్ షర్మిల సహా అతికొద్ది మంది బంధుమిత్రుల మధ్య ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఫోన్ ద్వారా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినట్లు చెబుతున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతో్న్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరిమితంగా మాత్రమే కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. ఏప్రిల్ 19వ తేదీ.. వైఎస్ విజయమ్మ పుట్టినరోజు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఆమె కడప జిల్లా పులివెందులలో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్, కోడలు వైఎస్ భారతి, షర్మిలతో కలిసి ఈ వేడుకలను జరుపుకొంటుంటారు. ఈ సారి మాత్రం ఆమె కుమార్తె ఇంటికే పరిమితం అయ్యారు. లోటస్‌పాండ్ నివాసంలో బంధువుల మధ్య కేక్ కట్ చేశారు.

విజయమ్మ చెల్లెలు, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలతా రెడ్డి, అతికొద్దిమంది కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వైఎస్ విజయమ్మ.. కొంతకాలంగా కుమార్తె వద్దే ఉంటున్న విషయం తెలిసిందే. వైఎస్ షర్మిల తన రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటించినప్పటి నుంచీ ఆమె కుమార్తెకు అండగా ఉంటున్నారు. ఈ నెల 9వ తేదీన ఖమ్మంలో వైఎస్ షర్మిల నిర్వహించిన బహిరంగ సభకు కూడా విజయమ్మ హాజరయ్యారు. వైఎస్ జగన్ తరఫున తాను ఈ సభకు హాజరయ్యానని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్‌ను జారీ చేయాలంటూ షర్మిల చేపట్టిన మూడు రోజుల నిరాహార దీక్షా సమయంలోనూ విజయమ్మ కుమార్తె వెంటే ఉన్నారు. దీక్షా శిబిరంలో కుమార్తెతో కలిసి పాల్గొన్నారు. ఇలా కొంతకాలంగా విజయమ్మ.. కుమార్తె వెంటే ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో పుట్టినరోజు నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్తారని భావించినప్పటికీ.. అలా జరగలేదు. ఈ సాయంత్రానికి ఆమె తాడేపల్లికి వెళ్లొచ్చనే ప్రచారం సైతం కొనసాగుతోంది. కేక్ కట్ చేయడానికి కొద్దిసేపటి ముందే వైఎస్ జగన్ ఫోన్ చేసి, విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications