తెలంగాణకు చెందిన ఆర్మీ జవాను పంజాబ్‌లో మృతి: ఎమ్మెల్సీ కవిత సంతాపం
ఛండీగఢ్: తెలంగాణకు చెందిన భారత ఆర్మీ జవాన్.. పంజాబ్ రాష్ట్రంలో అనుకోని ప్రమాదంలో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం వెంకటాపురంకు చెందిన దాదన్నగారి కళ్యాణ్ రావు(25) ఆరేళ్ల క్రితం ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యారు. భారత సైన్యంలో టెక్నికల్ విభాగంలో కళ్యాణరావు విధులు నిర్వహిస్తున్నారు.
కాగా, పంజాబ్ రాష్ట్రంలోని పటిండా ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా చెట్టుపైకి ఎక్కిన కళ్యాణ్ రావు.. ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం కళ్యాణ్ మృతి చెందారు. వెంకటాపురంలో శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

జవాను కళ్యాణ్ రావు మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సైనికుడు దాదన్నగారి కళ్యాణ్ రావు ప్రమాదవశాత్తు మరణించడం బాధాకరం. కళ్యాణ్ రావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని ట్విట్టర్ వేదికగా కవిత స్పందించారు.












Click it and Unblock the Notifications