
కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు బాల్క సుమన్ వార్నింగ్, జగ్గారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకపక్క బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తూ అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తుంటే, బండి సంజయ్, కిషన్ రెడ్డి లతో పాటుగా బీజేపీ నేతలకు అధికార పార్టీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇక మరోవైపు మే 6వ తేదీన తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్ నేతలు వీసీపై మండి పడుతూ ఉంటే రాహుల్ గాంధీ పర్యటనను టార్గెట్ చేసుకొని టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

బండి సంజయ్ చేస్తుంది పాదయాత్ర కాదు పాపాలను కడుక్కునే యాత్ర : బాల్క సుమన్
బండి సంజయ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ బండి సంజయ్ చేస్తున్నది పాదయాత్ర కాదని పాపాలను కడుక్కునే యాత్ర అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడం సరి కాదని పేర్కొన్న ఆయన, అడ్డుకోవడమే మీ పని అయితే కిషన్ రెడ్డి తెలంగాణలో తిరగలేరు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాగే బిజెపి వ్యవహరిస్తే బండి సంజయ్ పాదయాత్ర చేయలేడంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఓర్వలేనితనం తోనే బీజేపీ నేతలు ఇలా చేస్తున్నారంటూ బాల్క సుమన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

డబల్ ఇంజన్ ప్రభుత్వానికి దేశ ప్రజలు ఎర్రజెండా చూపిస్తారు: బాల్క సుమన్
ప్రధాని నరేంద్ర మోడీ అసమర్థత వల్ల దేశంలో కరెంటు కోతలు ఏర్పడ్డాయని బాల్క సుమన్ బిజెపి సర్కార్ ను టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ 24 గంటలు కరెంట్ అందిస్తున్నారని పేర్కొన్న బాల్క సుమన్, ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు అమలు అవుతున్నాయి అంటూ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశ సంపదను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా కట్టబెడుతుంది అని ఆరోపించారు. టిఆర్ఎస్ సర్కార్ పై ఒక్క అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టారా అంటూ బిజెపినేతలను ప్రశ్నించారు బాల్క సుమన్. బిజెపి మాయ మాటలు ప్రజలు నమ్మరు అని పేర్కొన్న ఆయన డబల్ ఇంజన్ ప్రభుత్వానికి దేశ ప్రజలు ఎర్రజెండా చూపిస్తారు అంటూ వ్యాఖ్యానించారు.

జగ్గారెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్
ఇక ఇదే సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జగ్గారెడ్డి టిఆర్ఎస్ పార్టీ నేతలపై చేసిన ఆరోపణలపై మండిపడిన బాల్క సుమన్ పోచమ్మ గుడిలో పొట్టేలు కట్టేసినట్టుగా జగ్గారెడ్డి ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి ఒళ్ళు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ద్రోహులకు జగ్గారెడ్డి కొమ్ముకాస్తున్నారని, ఉద్యమ పార్టీకి ద్రోహం చేసిన చరిత్ర జగ్గారెడ్డి బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. జగ్గారెడ్డి తనపై చేస్తున్న విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం అంటూ బాల్క సుమన్ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీపై విరుచుకుపడిన బాల్క సుమన్
ఇక ఇదే సమయంలో ఓయూ వచ్చే ముందు తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పర్యటన రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి రాహుల్ గాంధీ చేసేదేమీ లేదు అంటూ ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రం యూపీలోని ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని అసమర్ధ నేత రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు.