కేసీఆర్ ను గద్దె దించటమే లక్ష్యంగా బండి సంజయ్ భారీ ప్లాన్.. గులాబీ నేతలకు టెన్షన్
తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సర్కారును గద్దె దింపడం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండే బిజెపి కార్యకర్తలు కార్యక్షేత్రంలోకి దిగాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే అంశాల పైన కూడా బిజెపి అధినాయకత్వం దృష్టి సారిస్తుంది.

చేరికలపై ఫోకస్ చేసిన బీజేపీ
ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి గ్రామాలు, మండలాల్లో పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి భారీ ప్లాన్ రచిస్తున్న బిజెపి అధినాయకత్వం గ్రామ, మండల స్థాయిలో పేరున్న నేతలను తమ పార్టీలో చేర్చుకుని గ్రామ స్థాయిలోనే టీఆర్ఎస్ కు దెబ్బకొట్టి బిజెపిని విస్తరింప చేయాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో తాజాగా టిఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్టుగా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ బీజేపీనే అని చూపించే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ బిజెపి.

పార్టీలో భారీగా చేరికలకు స్కెచ్.. తాజాగా తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ చేరిక
ఈ మేరకు ఇప్పటికే బీజేపీ లో చేరికలకు జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుసూదన్ టిఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 16వ తేదీన జిట్టా బాలక్రిష్ణ రెడ్డి, రాణి రుద్రమదేవి ఆధ్వర్యంలో యువ తెలంగాణ పార్టీని కూడా భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బిజెపిలోకి వలసల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

జాయినింగ్స్ అండ్ కో ఆర్డినేషన్ కమిటీ .. చేరికలపై బండి సంజయ్ సమావేశం
ఈ మేరకు బండి సంజయ్ ఈ నెల 12వ తేదీన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నల్లు ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలోని జాయినింగ్స్ అండ్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులతో సమావేశమై పార్టీలోకి చేరికల పురోగతిని, తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణను చర్చించనున్నారు. ప్రతిసారీ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థుల కొరత వేధిస్తుంది. పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగే బలమైన నేతలు ఎక్కువ సంఖ్యలో లేకపోవడం బీజేపీకి మైనస్ గా మారుతుంది.

గ్రామ స్థాయి నుండే టీఆర్ఎస్ నామరూపాలు లేకుండా చేసే స్కెచ్
ఈ క్రమంలో ఈసారి ఎటువంటి లోపం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి బలమైన నేతలు బరిలోకి దింపడం కోసం ఇప్పటి నుండే బీజేపీ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. గ్రామస్థాయి నుంచి టిఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా బిజెపి భారీ ప్లాన్ తో ముందుకు వెళుతోంది. గ్రామాలు, మండలాల స్థాయి నుండే పార్టీని బలోపేతం చెయ్యటం లక్ష్యంగా పని చేస్తుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి బండి సంజయ్ భారీ వ్యూహం ఏమేరకు ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications