కవితకు బెయిల్: కాంగ్రెస్‌కు థ్యాంక్స్- కేసీఆర్ చతురత: బండి సంజయ్..!!
K Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

బెయిల్ కోసం ఆమె చేసిన ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు. వాటన్నింటినీ ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం తోసిపుచ్చుతూ వచ్చింది. జ్యుడీషియల్ కస్టడీని ఎప్పటికప్సుడు పొడిగించింది. ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ వచ్చింది ఢిల్లీ కోర్టు. బెయిల్ పిటీషన్లపై సానుకూలంగా స్పందించలేదు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. బెయిల్ మంజూరు చేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
వాదోపవాదాలను ఆలకించిన తరువాత కవితకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 10 లక్షల రూపాయల పూచీకత్తును సమర్పించాలని, లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్‌లో ఎలాంటి టాంపరింగ్‌కు పాల్పడకూడదని ఆదేశించింది.
కవితకు బెయిల్ లభించడం పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ విజయం సాధించాయని వ్యాఖ్యానించారు. రెండు పార్టీలు అలుపెరగని విధంగా బెయిల్ కోసం ప్రయత్నాలు సాగించాయని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ నాయకురాలు బెయిల్‌పై బయటకు రాగా.. కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారని బండి సంజయ్ గుర్తు చేశారు. అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసిన విషయాన్ని బండి సంజయ్ పరోక్షంగా ప్రస్తావించారు.
మొదట బెయిల్ కోసం బీఆర్ఎస్ తరఫున వాదించిన అభిషేక్ మను సింఘ్వీని రాజ్యసభకు పంపించడంలో కాంగ్రెస్ పార్టీకి కెేసీఆర్ సహకరించారని ఆరోపించారు బండి సంజయ్. ఈ విషయంలో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతను ప్రదర్శించారని చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications