సర్పంచ్ లతో కలిసి బండి సంజయ్ సమరభేరి .. జూన్ తొలివారంలో మౌనదీక్ష; టార్గెట్ కేసీఆర్!!
తెలంగాణ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న బండి సంజయ్, ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబ అవినీతిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ల సమస్యల పై మరో పోరాటానికి సిద్ధమయ్యారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
Recommended Video


సర్పంచ్ లతో కలిసి బండి సంజయ్ సమరభేరి .. జూన్ మొదటివారంలో మౌన దీక్ష
సర్పంచ్ లతో కలిసి సమరభేరికి సిద్ధమవుతున్న బండి సంజయ్ జూన్ తొలివారంలో వారితో కలిసి మౌనదీక్ష కు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వేదికగా సర్పంచ్ లతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి రెండు గంటల పాటు మౌన దీక్షను చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తుండటంతో బిల్లులు ఇచ్చే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బండి సంజయ్ సర్పంచ్ లతో కలిసి మౌనదీక్షకు దిగుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు
బండి సంజయ్ మౌనదీక్ష తో పాటుగా, అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు. పల్లె ప్రగతి పేరుతో గత నాలుగు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న పనులన్నింటినీ సర్పంచులు చేస్తున్నప్పటికీ వాటికి సంబంధించిన నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. సర్పంచులు చేసిన ఖర్చుకు సంబంధించిన బిల్లులను ఇప్పటికీ మంజూరు చేయకపోవడంతో గ్రామపంచాయతీలు దివాలా తీశాయని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు .

సర్పంచ్ ల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వ్యూహం
కొంతమంది సర్పంచ్ లు బయట అప్పులు తెచ్చి మరీ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో అప్పుల బాధ పెరిగి, వడ్డీలు పెరుగుతున్న క్రమంలో సర్పంచులు ఉపాధిహామీ కూలీలుగా పనిచేస్తున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలలో కనిపిస్తున్నాయని ఇటీవల అనేక చోట్ల సర్పంచ్ లు ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరువు పెడుతున్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలోని సర్పంచులకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్న బిజెపి పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. సర్పంచుల సమస్యల కోసం పోరాటం చేయాలని నిర్ణయించింది.
మొదట మౌన దీక్ష ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తుంది. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకుంటే సర్పంచ్ ల సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రం గ్రామపంచాయితీలకు నిధులిస్తున్నా కేసీఆర్ నిధులను పక్కదారి పట్టించటంపై బీజేపీ ఫైర్
గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల నిధి ఇస్తుందని చెబుతూ, ఆ నిధులను పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వ తీరుపై ఆరోపణలు గుప్పిస్తున్న బిజెపి నాయకులు, తాజాగా సర్పంచులకు బాసటగా మరో పోరుకు సిద్ధం కావడం ప్రధానంగా కనిపిస్తుంది.
ఈ పోరాటం ద్వారా గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేస్తోంది. దానివల్ల గ్రామ పంచాయతీలు, సర్పంచ్ ల పరిస్థితి ఏ విధంగా తయారయింది అన్నది చూపించే ప్రయత్నం చేస్తోంది బిజెపి.












Click it and Unblock the Notifications