ఏపీ స్ఫూర్తితో తెలంగాణాలో అధికారంలోకి బీజేపీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు ఎన్నికలలో అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమి కొట్టాలని దేశంలో మూడు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అక్కడ కూడా లేకుండా చేయాలని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు, పవన్ లకు కేంద్రమంత్రి బండి సంజయ్ ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి ఆధ్వర్యంలో జరిగిన భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్ర నిర్వహించిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఏపీలోని డబుల్ ఇంజన్ సర్కార్ స్పూర్తిగా అధికారంలోకి
ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తన అదృష్టం అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ వాజ్పేయి విగ్రహాలు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రను సృష్టిస్తుందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇలాంటి వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. ఏపీలోని డబుల్ ఇంజన్ సర్కార్ ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపడతామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఫెయిల్, కేసీఆర్ ఫాం హౌస్ కే
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాలలో ఫెయిల్ అయింది అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం బోర్లా పడిందని బండి సంజయ్ పేర్కొన్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమయ్యారని అన్నారు. రాజకీయాలలో కేసీఆర్ క్రియాశీలకంగా లేరని ఎద్దేవా చేశారు. ప్రజలు కూడా ఆయనను మరిచిపోయారని బండి సంజయ్ పేర్కొన్నారు.
రాష్ట్రాభివృద్ధికి మోదీ సర్కార్ నిధులే కారణం
అయితే బిజెపికి వెళ్లాల్సిన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మళ్ళాయి అని పేర్కొన్న బండి సంజయ్ మళ్ళీ ఆ పొరబాటు జరగకుండా చూస్తామన్నారు. ఏపీ ని స్ఫూర్తిగా తీసుకొని వచ్చే ఎన్నికలలో కచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మోడీ ప్రభుత్వ నిధులే కారణమని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళతామని బండి సంజయ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications