Bandi Sanjay: కరీంనగర్ ఐటీ టవర్‍లో తొండలు గుడ్లు పెడుతున్నాయి.. బండి సంజయ్..
కరీంనగర్ ఐటీ టవర్ లో తొండలు గుడ్లు పెడుతున్నాయని బీజేపీ ఎంపీ, కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ ఎద్దేవా చేశారు.బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.24 వేలు అందిస్తామని చెప్పారు. రైతు పక్షపాతి ఎవరో.. ఎన్నికల సమయంలో మీరే ఆలోచించి.. ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే వరి కనీస మద్దతు ధర రూ.3100 చేస్తామని స్పష్టం చేశారు.
మహిళలకు ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క కొత్త కంపెనీని కూడా తీసుకురాలేని దద్దమ్మ గంగుల అని విమర్శించారు. కరీంనగర్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులకు భూకబ్జాల చరిత్ర ఉందన్నారు. ఎన్నికలు అయిపోగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై కేసులు సెటిల్ చేసుకుంటారని చెప్పారు. కానీ తనపై ఉన్న కేసుల పరిస్థితి ఏంటని అడిగారు.

తనది ప్రజల పక్షాన పోరాటాల చరిత్రని గుర్తు చేశారు. ఆస్తులు సంపాదించినట్లు రుజువు చేస్తే.. అవన్నీ ప్రజలకు రాసిస్తానని బండి సంజయ్ తేల్చి చెప్పారు. ప్రవాస భారతీయుల కోసం బీజేపీ కొట్లాడుతుదని.. కాబట్టి తమకు ఓటేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రేషన్ బియ్యం కేంద్రమే అందిస్తుందని స్పష్ట చేశారు. ఐకేపీ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల నుండి కొనే వడ్ల పైసలన్నీ కేంద్రమే చెల్లిస్తోందని బండి సంజయ్ గుర్తు చేశారు.
వడ్లను సేకరించినందుకుగాను కేసీఆర్ ప్రభుత్వానికి బ్రోకరేజీ రూపంలో కమీషన్ కూడా కేంద్రమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ ప్రజలకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. బీసీ మంత్రిగా ఉంటూ బీసీలకు బీసీ బంధు పైసలియ్యలేదని దుయ్యబట్టారు. పేపర్ లీకేజ్ వల్ల తెలంగాణలో ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా తాను ధర్నా చేస్తే తనను జైలుకు పంపారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications