
కేసీఆర్ యూజ్ లెస్ ఫెలో; టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా; బట్టలూడదీసి కొడతామన్న బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కు టీఆర్ఎస్ నేతలు సమాధి కట్టడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్దారు. కేసీఆర్... యూజ్ లెస్ ఫెలో.. ఎవడ్రా మీకు చదువు, సంస్కారం నేర్పింది? బతికున్నవాళ్లకు సమాధి కడతారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ తీరుపై, టిఆర్ఎస్ పార్టీ నాయకులు చర్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బట్టలూడదీసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
. బండి సంజయ్ వార్నింగ్
బతికుండగానే మన సమాధి కట్టి, మన ఫొటో పెడితే కుటుంబ సభ్యులు బాధపడతారా? లేదా?... మరి టీఆర్ఎస్ ఫాల్తు గాళ్లను ఏమనాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజాయితీకి నిలువుటద్దం అయిన జేపీ నడ్డా సమాధి కట్టిన టీఆర్ఎస్ నేతలను ఏం చెయ్యాలో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ ను ఏం చేయాలంటూ మండిపడ్డారు. రేపు తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని పేర్కొన్న ఆయన, ఈరోజు ఎవరైతే జేపీ నడ్డా కి సమాధి కట్టారో వారిని బట్టలూడదీసి కొట్టే రోజులు వస్తాయని బండి సంజయ్ హెచ్చరించారు.

మునుగోడు ఎన్నికలంటే కేసీఆర్ కు వణుకు
కార్యకర్తలను కంట్రోల్ చేయడం రాకపోతే అన్ని మూసుకొని ఫామ్ హౌస్ లో పడుకోవాలని, ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే సహించే ప్రసక్తే లేదని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్ కు మునుగోడు ఎన్నికలంటే వణుకు పుడుతోందని, అందుకే ఈ తరహా చర్యలకు దిగుతున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికలలో వరద సాయంపై, హుజురాబాద్ ఎన్నికలలో చేసిన దుష్ప్రచారం పై ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా సిగ్గు రాలేదని కెసిఆర్ ని తిట్టిపోశారు.
నీకు ఎన్ని సమాధులు కట్టాలి కేసీఆర్
తెలంగాణలో ఫ్లోరోసిస్ సమస్య లేదని, మిషన్ భగీరథ నీళ్లతో ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైందని పదేపదే గొప్పలు చెప్పుకున్న టీఆర్ఎస్ నేతలు అదే అంశంపై సమాధి కట్టడానికి సిగ్గు లేదా? అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భ్రుతి, దళిత బంధు సహా ఇఛ్చిన హామీలన్నీ విస్మరించిన నీకు తెలంగాణలో ఎన్ని సమాధులు కట్టాలి? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. అట్లా చేస్తే నీ పరిస్థితి ఏమిటో ఆలోచించావా? అంటూ సంజయ్ దుయ్యబట్టారు.
దమ్ముంటే నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తావా .. కేసీఆర్
గొల్ల, కురుమలకు గొర్రెల పైసలు రాకుండా ఫ్రీజ్ చేయాలంటూ తాను ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు నిరూపించే దమ్ము ఉందా? అని కేసీఆర్ ను నిలదీశారు. దమ్ముంటే నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా భార్యాపిల్లలతో కలిసి ప్రమాణం చేసేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కేసీఆర్ కు దమ్ముంటే డేటు, టైము ఫిక్స్ చేసి తన సవాల్ ను స్వీకరించాలని బండి సంజయ్ పేర్కొన్నారు. కొడుకేమో ట్విట్టర్లో,... బిడ్డ లిక్కర్లో... అల్లుడు దొంగ మాటల్లో.... షడ్డకుడి కొడుకు కమీషన్లలో...ఇదీ కేసీఆర్ కుటుంబం తీరు అంటూ నిప్పులు చెరిగారు

కేసీఆర్ కాళ్ళ దగ్గర కమ్యూనిస్టుల పరువు తాకట్టు
ఖమ్మంలో టీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేసిన కేసులో ఏ1గా ఉన్నది కమ్యూనిస్టు నేతేనని, ఆ కేసును మాఫీ చేసేందుకే కమ్యూనిస్టు పార్టీని, కార్యకర్తల పోరాటాలను సీఎం కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆపదొస్తే ఆదుకునే పేరున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంటే మునుగోడు ఎన్నికల్లో ధీటైన వ్యక్తే లేరని అన్నారు. ఒక్క వ్యక్తిని ఎదుర్కొవడానికి దండుపాళ్యం ముఠా రంగంలోకి దిగిందా అని నిప్పులు చెరిగారు.

రాజగోపాల్ రెడ్డి సింహం .. సింగిల్ గానే పోరాటం: బండి సంజయ్
గుంట నక్కలు గుంపులుగా వచ్చాయని... రాజగోపాల్ రెడ్డి సింహం... సింగిల్ గా వచ్చాడని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. గతంలో హుజూరాబాద్ లో నూ డబ్బును టీఆర్ఎస్ నేతలు ఏరులై పారించారు. అక్కడి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారు... హుజూరాబాద్ తీర్పుతో ఫాంహౌజ్ లో ఉన్న కేసీఆర్ ను ఇందిరాపార్క్ కు గుంజుకు వచ్చామని, ఇప్పుడు పిచ్చోడిలెక్క దేశమంతా తిరుగుతున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మునుగోడు లోనూ కేసీఆర్ బాక్సులు బద్దలు కొట్టాలన్నారు.