డిపాజిట్ రాని ప్రకాష్ రాజ్.. బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ డ్రామాలు: బండి సంజయ్ ఫైర్!!
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ప్రకాష్ రాజ్ రావడంతో టార్గెట్ చేసిన బండి సంజయ్ బెంగళూరులో డిపాజిట్ రాని వాళ్ళని కూడా తీసుకొచ్చి బి ఆర్ ఎస్ పేరుతో కెసిఆర్ డ్రామాలాడుతున్నారు అంటూ మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ కు సీఎం కేసీఆర్ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ పార్టీ ఇన్చార్జిగా బాధ్యత అప్పగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేశారు. డిపాజిట్ కూడా రాని వాళ్ళతో ఏం చేద్దామని అంటూ టార్గెట్ చేశారు.

బందిపోట్ల రాష్ట్ర సమితి బీఆర్ఎస్: బండి సంజయ్
కెసిఆర్ పార్టీ భారత రాష్ట్ర సమితి కాదని, అది బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఆరోపించిన బండి సంజయ్, మిగులు బడ్జెట్ వున్న తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ లోటు బడ్జెట్ లోకి నెట్టి, అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని మండిపడ్డారు. బందిపోట్ల మాదిరిగా కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకు తిన్నదని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలు గమనిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ ఆవిర్భావ సభ ఒక సంతాప సభలా జరిగిందంటూ బండి సంజయ్ విమర్శించారు.

సమైక్యవాదం పేరుతో కెసిఆర్ కొత్త డ్రామాలు
ఒకరి మొహంలో కూడా సంతోషం లేదని, పార్టీ పేరు, జెండా నుండి తెలంగాణ తీసేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇకనుండి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్న బండి సంజయ్, తెలంగాణ పేరు తీసేసి తెలంగాణవాదం అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మళ్లీ ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటును రగిలించడానికి సమైక్యవాదాన్ని తెరమీదకు తీసుకువచ్చినట్టు బండి సంజయ్ ఆరోపించారు. సమైక్యవాదం పేరుతో కెసిఆర్ కొత్త డ్రామాలకు తెర తీశారని విమర్శించారు.

కవితను టార్గెట్ చేసి బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు
ఇక ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ పార్టీతో దేశంలో లిక్కర్ దందా చేసి అడ్డంగా దొరికిపోయింది అని, ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంటర్నేషనల్ లిక్కర్ దందా చేస్తుందా? అంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారాన్ని, గుజరాత్లో బీజేపీ విజయం తాలూకా సంబరాలను ప్రజల మైండ్ నుంచి డైవర్ట్ చేయడం కోసం కెసిఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని నానా తంటాలు పడుతున్న కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదని, ఇక దేశ ప్రజలు ఏం పట్టించుకుంటారు అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications