రాహుల్ గాంధీ, కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. విదేశాల్లో పర్యటిస్తూ భారత్‌ను కించపర్చడమే కాకుండా ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తున్న రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదని వ్యాఖ్యానించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి ఎస్సార్ కన్వెన్షన్ హాల్‌లో రంగారెడ్డి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కూన రవికుమార్, తదితర నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. 'మిస్టర్ రాహుల్ గాంధీ.. క్విట్ ఇండియా' అని అన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయన్నారు. అందరూ కలిసి పోటీ చేసినా ఈసారి జీహెచ్ఎంసీపై కాషాయ జెండాను ఎగురవేసి తీరుతామని, మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

సభ్యత్వ నమోదు విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇన్సూరెన్స్, ఇతర తాయిలాలు ఆశ చూపకుండా సభ్యత్వ నమోదు చేస్తోందన్నారు. బీజేపీ జాతీయవాద భావాలున్న పార్టీ అని అన్నారు. దేశం కోసం ప్రాణాలిచ్చే పార్టీ అని వ్యాఖ్యానించారు అట్టడుగునున్న పేదవాడికి సైతం ప్రభుత్వ ఫలాలు అందించాలని అంత్యోదయ సిద్ధాంతం పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ హాయంలో దేశంలోని 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. దేశానికి మేలు చేసే అనేక పనులు చేస్తోందన్నారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తాడనుకున్న.. కానీ, రేవంత్‌తో సాధ్యం కావడం లేదు. ఎందుకంటే కేసీఆర్‌కు కాంగ్రెస్‌లో ఎవరిని పట్టుకుంటే పనైతదో తెలుసు. అందుకే ఢిల్లీ పోయి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చిండు.. అందుకే కేసీఆర్ కుటుంబం జోలికి రేవంత్ వెళ్లడం లేదని అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చివుంటే కేసీఆర్ కుటుంబాన్ని.. అంకుశం సినిమాలో రాంరెడ్డిని ఎట్లా గుంజుకుపోయి జైల్లో వేశారో.. అలానే జైల్లో వేసేవాళ్లమని చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ అన్ని అరాచకాలు చేశారన్నారు.
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని బండి సంజయ్ అన్నారు.












Click it and Unblock the Notifications