బాబుతో అందుకే కెసిఆర్ చేయి కలిపారు: బయటపెట్టిన టిటిడిపి నేతలు!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్ల కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్నేహహస్తం చాటారని తెలంగాణ టిడిపి నేతలు గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని, తద్వారా టిడిపికి పూర్వ వైభవం ప్రారంభమవుతుందని టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ, టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ విపక్ష నేతలను కొనే పథకం తీసుకు వచ్చారని, ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించడం తప్ప ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన కుదింపు జీవో పైన హైకోర్టు స్టే విధించడం హర్షణీయమని గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మాగంటి గోపినాథ్ అన్నారు. హైకోర్టు తీర్పు తెరాస ప్రభుత్వానికి చెంప పెట్టు అన్నారు.

తెలంగాణలో టీడీపీ లేనట్టే: కడియం
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ పరిస్థితి ఏంటో ప్రజలందరికీ తెలిసిందేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణలో టీడీపీ బతికి బట్టగట్టే పరిస్థితుల్లో లేదన్నారు. తెలంగాణ ప్రజలు టీడీపీని దగ్గరకు కూడా రానీయడంలేదన్నారు.
ఉప్పల్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశాన్ని మల్లాపూర్‌లోని వీఎన్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి తదితర నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కడియం మాట్లాడారు. రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్‌కు క్యాడర్ లేక ఇబ్బంది పడుతోందన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో వరంగల్ ఫలితం పునరావృతమయ్యేలా కృషి చేద్దామన్నారు. గ్రేటర్‌లో గులాబీ జెండా ఎగరేయడానికి కంకణబద్దులమై పని చేద్దామన్నారు. జీహెచ్‌ఎంసీలో వంద సీట్లు గెలిచేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు అహర్నిశలు ప్రయత్నించాలన్నారు.












Click it and Unblock the Notifications