తెలంగాణాలో మరో కొత్త ఎయిర్ పోర్ట్.. కేంద్రమంత్రి శుభవార్త!
తెలంగాణలో మరో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం సిద్ధమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం తప్పకుండా విమానాశ్రయం నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ స్థల పరిశీలనకు రానున్న కేంద్ర సాంకేతిక బృందం
ఈ మేరకు నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రితో భేటీ అయి, గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలం కాకపోవడంతో కొత్తగా గుర్తించిన స్థలాల వివరాలు తెలిపారు.

నివేదిక అనుకూలంగా వస్తే కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు
కొత్త స్థలాల్లో భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంశాలను బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. వారి నివేదిక అనుకూలంగా వస్తే కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు సాంకేతిక బృందాన్ని పంపించేందుకు చొరవ తీసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ తీర్ధ యాత్రికులకే కాదు ప్రాంత అభివృద్ధికి కీలకం
ఈ ప్రాజెక్టు భద్రాచలం తీర్థయాత్రికులు, స్థానిక ప్రజలకు గొప్ప ఉపయోగం చేకూర్చనుంది.సింగరేణి పారిశ్రామిక ప్రాంతంతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయం సందర్శనకు వచ్చే భక్తులకు, వ్యాపారవేత్తలకు ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఎంతో మేలు జరుగుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగై, ఈ ప్రాంత సమగ్ర ఆర్థిక పురోగతికి బాటలు పడతాయని భావిస్తున్నారు.
తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి కేంద్ర సహకారం
తెలంగాణా రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి కేంద్రం నుండి సహకారం లభిస్తోంది, ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ పూర్తి చేసి ఏవియేషన్ అధారిటీకి అప్పగించగా, కాకతీయ థీమ్‌తో టెర్మినల్ నిర్మాణం చేపట్టి త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ఇక ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును కలవనున్నారు.
ఈ జిల్లాలలో ఎయిర్ పోర్ట్ లపై తాజా అప్డేట్ ఇదే
పెద్దపల్లి జిల్లా అంతర్గావ్‌లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయనం చేపట్టింది. భారతీయ వాయుసేన దీనికి అనుమతినిచ్చింది. ప్రాంతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించటం కోసం మహబూబ్ నగర్ లో మరియు నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లిలో డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందాయి. ఇక ఇప్పటికే ఉన్న ఎయిర్‌స్ట్రిప్ ఆధారంగా ఆదిలాబాద్‌లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలున్నాయి.













Click it and Unblock the Notifications