హాట్ హాట్‌గా రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం: భేటీ తర్వాత భట్టి ఇలా, వీహెచ్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. సొంత పార్టీపై విమర్శలు చేయడంతోపాటు తాను బీజేపీలో చేరుతున్నట్లు సంకేతాలిచ్చారు రాజగోపాల్ రెడ్డి. అంతేగాక, అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొవడం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ సీరియస్
ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు ఆయనపై మండిపడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని చెప్పడంతోపాటు సోనియా గాంధీ ఈడీ విచారణలో చట్టం తన పని తాను చేస్తుందంటూ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణికం ఠాకూర్.. రాజగోపాల్ వ్యవహారంపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

అందుకేనా? అంటూ రాజగోపాల్ రెడ్డి మార్పుపై వీహెచ్ ఆగ్రహం
తాజాగా, రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు స్పందించారు. పాలు, పెరుగులపై కూడా జీఎస్టీ వేసిన బీజేపీలోకి ఎందుకు వెళుతున్నారో? అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే అన్ని పదవులు పొందారని, ఇప్పుడు పార్టీని వీడటం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే రాజగోపాల్ రెడ్డి కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు. తమ్ముడిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుజ్జగించాలన్నారు.

రాజగోపాల్ రెడ్డితో భేటీ తర్వాత భట్టి విక్రమార్క ఏమన్నారంటే..?
మరోవైపు, టీపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క సోమవారం రాజగోపాల్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని తాను సూచించానని చెప్పారు భట్టి. పార్టీ ప్రయోజనాలతోపాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేద్దామని సూచించినట్లు తెలిపారు. రాజగోపాల్ రెడ్డికి సోనియా, రాహుల్ నాయకత్వంపై రాజగోపాల్ రెడ్డికి చాలా గౌరవం ఉందన్నారు. కేసీఆర్ పై సీరియస్ గా కొట్లాడుదామని తనతో చెప్పినట్లు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి తమ ఎమ్మెల్యే కాబట్టే మాట్లాడేందుకు వచ్చానని, ఆయన పార్టీ నుంచి వెళతారని తాను భావించడం లేదని అన్నారు. పదవులు చాలా మంది కోరుకుంటారు.. కానీ, కొందరికే వస్తాయన్నారు. ప్రజల లక్ష్యాల కోసం పనిచేద్దామని గోజగోపాల్‌తో చెప్పినట్లు భట్టి తెలిపారు.












Click it and Unblock the Notifications