టీ బీజేపీ నేతలపై హైకమాండ్ సీరియస్ - ఆ ఇద్దరి పదవుల్లో మార్పు..!?
తెలంగాణ బీజేపీ నేతలపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. అసమ్మతి నేతలపై కఠిన చర్యలకు నిర్ణయించింది. కాంగ్రెస్ ఎదుగుతోందంటూ సొంతపార్టీ నేతలే కొంతమంది ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణి స్తోంది. తాజా పరిణామాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పార్టీ నాయకత్వానికి సూచించింది. ఈ నెల 15న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన సమయంలో కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు. పార్టీ నాయకత్వ మార్పుతో పాటుగా పదవుల్లోనూ మార్పుల దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
అధినాయకత్వం సమీక్ష: తెలంగాణ బీజేపీలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై అధినాయకత్వం సమీక్ష చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీలో ఆధిపత్య పోరు..అంతర్గత సమస్యలను సీరియస్ గా తీసుకుంది. అసమ్మతి.. అసంతృప్తి.. ఏకపక్షం.. అంటూ బహిరంగ వేదికలపై వ్యాఖ్యలు ఎవరు చేసినా సమర్థనీయం కాదని పార్టీ ముఖ్య నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం.

నలుగురు జాతీయ కార్యవర్గసభ్యులు, ఇద్దరు మాజీ ఎంపీలు పాల్గొన్న ఈ సమావేశంలో.. అసమ్మతి నేతలతో ఈటల భేటీ అయిన అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, సీనియర్ నేతలు సుగుణాకర్‌రావు, మల్లారెడ్డి తదితరులు ఇటీవల సమావేశమై, పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
నాయకత్వానికి నివేదికలు: రాష్ట్ర బీజేపీలో ఎవరి దారి వారిదే అన్నట్లుగా కొనసాగుతున్న పరిస్థితిపైన పార్టీ నాయకత్వానికి నివేదికలు అందాయి. పార్టీకి నష్టం చేసే విధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల పైన రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి సునీల్ బన్సల్‌ను నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ నెల 15న అమిత్ షా..ఆ తరువాత పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా తెలంగాణకు వస్తున్నారు.
అమిత్ షా రాక సమయంలో పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష ఏర్పాటు చేసారు. ఆ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెబుతున్నా.. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పొత్తుల దిశగా ఆలోచన చేయాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, దీని కారణంగా లాభమా..నష్టమా అనే కోణంలో చర్చలు చేస్తున్నట్లు సమాచారం.
నేతల మధ్య సమన్వయలోపం: పాత, కొత్త నేతల మధ్య సమన్వయలోపం పైనా పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్రకు బ్రేక్ పడటం వెనుకా కుట్ర ఉందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సంగ్రామ యాత్రకు బ్రేక్ పడేలా చేశారనే అభిప్రాయం కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండదని ఇప్పటికే హైకమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. కానీ, మారుతున్న పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం తమ ఆలోచనల్లోనూ మార్పులు చేసుకొనే ఛాన్స్ ఉందని.. పార్టీలో ఎన్నికలకు సిద్దం చేసే క్రమంలో ముఖ్య నేతల బాధ్యతల్లో మార్పులు తప్పవని సీనియర్లు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తానికి అమిత్ షా పర్యటన వేళ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications