ప్రొ.జయశంకర్ బతికుంటే కన్నీరు ఏరులై -కేసీఆర్‌పై విజయశాంతి మండిపాటు -ఘనంగా పెద్ద సార్ జయంతి
కేసీఆర్ ఏలుబడిలోని తెలంగాణను చూస్తే పెద్ద సార్ ప్రొఫెసర్ జయశంకర్ కన్నీరు పెట్టుకునేవారని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ బతికుంటే... నేటి తెలంగాణ స్థితిని చూసి, తీవ్రంగా బాధపడేవారని, ఇప్పటి పరిస్థితిని చూసి, ఇందుకా తెలంగాణ సాధించింది? అని తీవ్రంగా బాధపడేవారని పేర్కొన్నారు.
మన భూమి, మన ఉద్యోగాలు, మన నీరు మనకే కావాలని ఎందరో ఉద్యమకారులు కుటుంబాల్ని పణంగా పెట్టి బలిదానాలతో అమరులయ్యారని, వారి ఆశయాలకు ఈ సర్కారు ఏ కాస్తయినా విలువనిచ్చిందా? అని సూటిగా ప్రశ్నించారు. మన నీరు దోపిడీకి గురవుతుంటే తెలంగాణ సర్కారు చోద్యం చూస్తూ కూర్చుందని తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడేనాటికి దేశంలోనే మనది ధనిక రాష్ట్రమని చెప్పి నేడు అప్పుల కుప్పగా మార్చేశారని మండిపడ్డారు. అభివృద్ధి పనులకు నిధులివ్వలేక... పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక అంతా అస్తవ్యస్తంగా మార్చేశారని విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. జయశంకర్ జయంతి సందర్భంగా విజయశాంతి శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో..

''ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసి, మలిదశ ఉద్యమానికి ప్రాణమై నిలిచిన జయశంకర్ సార్ బతికుంటే... తెలంగాణలో నేడున్న పరిస్థితి చూసి ఇందుకేనా రాష్ట్రాన్ని సాధించుకుందని ఆయన కంట కన్నీరు ఏరులై పారేది. మన భూమి, మన ఉద్యోగాలు, మన నీరు మనకే కావాలని ఎందరో ఉద్యమకారులు కుటుంబాల్ని పణంగా పెట్టి బలిదానాలతో అమరులయ్యారు. వారి ఆశయాలకు ఈ సర్కారు ఏ కాస్తయినా విలువనిచ్చిందా? మన నీరు దోపిడీకి గురవుతుంటే తెలంగాణ సర్కారు చోద్యం చూస్తూ కూర్చుంది. నకిలీ విత్తనాలు, ఎరువుల కొరతను ఎదుర్కుని అన్నదాతలు పంటలు పండిస్తుంటే... మద్దతు ధర లేదు, కొనుగోలు కేంద్రాలు ఉండవు. చివరకు గతిలేక తమ పంటలకు తామే మంట పెట్టుకోవాల్సిన దుస్థితి. ఇక
సర్కారు కొలువుల కోసం గత ఏడేళ్ళలో జరిగిన ఆత్మహత్యల గురించి తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతోంది. లక్షల సంఖ్యలో ఖాళీలున్నా భర్తీ చెయ్యడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడేనాటికి దేశంలోనే మనది ధనిక రాష్ట్రమని చెప్పి నేడు అప్పుల కుప్పగా మార్చేశారు. అభివృద్ధి పనులకు నిధులివ్వలేక... పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక అంతా అస్తవ్యస్తంగా మార్చేశారు. రాష్ట్రంలోని నగరాల్ని డల్లాస్, ఇస్తాంబుల్, లండన్ లాగా ఇంకేవేవో చేసేస్తామన్నారు... తీరా చూస్తే వాన చినుకు పడితే చాలు కాలనీలకు కాలనీలే నెలల తరబడి నీట మునిగే పరిస్థితి. ఇక కోవిడ్ విషయానికొస్తే కార్పోరేట్ల దోపిడీని నిలువరించలేక ప్రజారోగ్యాన్ని అభద్రతలోకి నెట్టేశారు. ఇదేనా జయశంకర్ సార్ కోరుకున్న తెలంగాణ?... ఇది అధికార పార్టీకి మాత్రమే బంగారు తెలంగాణ తప్ప, ప్రజలకు కాదు. సార్ మన మధ్య ఉంటే, ఈ పాలకుల్ని గద్దె దించేందుకు కచ్చితంగా మరో ఉద్యమానికి ఊపిరులూదేవారు'' అని విజయశాంతి పేర్కొన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్..
తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడిగా, ఉద్యమ భావజాల వ్యాప్తికోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జన హృదయాల్లో సదా నిలిచిఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురసరించుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగపూరిత సేవలను స్మరించుకున్నారు. సబ్బండవర్ణాల సమగ్రాభివృద్ధి కోసమే తెలంగాణ స్వరాష్ట్రం అని తెలిపిన జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం ఒకొకటిగా నెరవేరుస్తున్నదని చెప్పారు. రాష్ట్రాన్ని సాధించిన ఏడేండ్లలోనే సాగునీరు, వ్యవసాయం వంటి పలు రంగాలను తీర్చిదిద్దుకుంటూ వస్తున్నామని పేర్కొన్నారు. అదే వరుసలో సకల జనుల సమున్నతాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవాలు తెలంగాణ అంతటా ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ లో జయశంకర్ చిత్రపటానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన వెంట మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్ కుమార్ తదితరులున్నారు. అలాగే, ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని హన్మకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ పార్కులో శుక్రవారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రద్ధాంజలి ఘటించారు. విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని మంత్రి అన్నారు. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించే మహనీయుడుయని మంత్రి అన్నారు. అటు,
తెలంగాణ సిద్ధాంత కర్త, దివంగత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బండ ప్రకాష్, బిబి పాటిల్, ఎమ్ కవిత, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విసి ప్రొ. సీతారామరావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి ఎంపీలు, ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఎంపి డా, బండ ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనితర కృషి చేసిన వ్యక్తి ప్రొ, జయశంకర్ సార్ అని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాల పై ఆయన ఎలుగెత్తి పోరాడారని అన్నారు. ఇక హైదరాబాద్ లోని..
తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగాయి. ప్రధాన ద్వారం వద్ద ఉన్న జయశంకర్ విగ్రహానికి వర్శిటీ ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్‌రావు, రిజిస్ర్టార్ డాక్టర్ సుఽధీర్‌కుమార్ పూల మాలవేసి నివాళులర్పించారు. ఆయన పేరిట ఏర్పాటయిన వర్శిటీ ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతాంగ సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ఈసందర్భంగా ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ (ఆగష్టు 6, 1934 - జూన్ 21, 2011) వరంగల్ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011 జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు.












Click it and Unblock the Notifications