అసెంబ్లీలో తనను చూడొద్దనే; సీఎం ఇచ్చిన స్లిప్పుతో సస్పెన్షన్: నిరసన దీక్షలో ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, సీఎం నిరంకుశత్వానికి నిరసనగా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టామని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెల్లడించారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుతో తనను ప్రజలు శాసనసభకి పంపిస్తే తను సభలో లేకుండా చేశారని ఆయన విమర్శించారు. సీఎం ఇచ్చిన స్లిప్పుతో స్పీకర్ తమను బయటకు పంపారని మండిపడ్డారు. కుట్రపూరితంగా తనను బయటకు పంపించి, తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు.

తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్
రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కెసిఆర్ చేసిన మూర్ఖపు మాటలకి వ్యతిరేకంగానూ నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు ఈటల రాజేందర్. కెసిఆర్ నియంతృత్వ పోకడలతో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో మాట్లాడిన ఈటల రాజేందర్ హుజరాబాద్ లో సీఎం కేసీఆర్ తనలాంటి ఉద్యమకారుడుని, 20 ఏళ్ల పాటు తనతో నడిచిన వ్యక్తిని కుట్రపూరితంగా వెళ్లగొట్టి గొంతు నొక్కే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

కేసీఆర్ కు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే
కేసీఆర్ అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయల సొమ్ము ఆరు నెలల పాటు హుజురాబాద్లో కుమ్మరించినా, పదుల సంఖ్యలో మంత్రులను రంగంలోకి దించి మళ్లీ తన ముఖం కనబడకుండా చెయ్యాలని ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అసెంబ్లీలో తనను చూడకూడదనే కేసీఆర్ దుర్మార్గపు ఆలోచన అని పేర్కొన్న ఈటల, తన వల్ల అకారణంగా మిగతా ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

నియంతృత్వ ధోరణి బయటపెట్టుకున్న కేసీఆర్
హుజురాబాద్ ఎన్నికల్లో కెసిఆర్ అహంకారాన్ని ప్రజలు ఓడించిన రోజున నైతిక బాధ్యత తీసుకొని సీఎం పదవికి శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని తాను భావించానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కానీ కేసీఆర్ ఆ విధంగా చేయలేదని తెలిపారు. కెసిఆర్ తన నియంతృత్వ ధోరణి బయట పెట్టుకుంటూ రాజ్యాంగం పైన విమర్శలు చేశారని, రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటూ వ్యాఖ్యలు చేశారని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రద్దు చేసి గవర్నర్ ను అవమానించారని మండిపడ్డారు.

సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కి సస్పెన్షన్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనధికార రాజ్యాంగం అమలు అవుతుంది అంటూ మండిపడ్డారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కి, బీజేపీ ఎమ్మెల్యేల హక్కులను అణచి వేశారు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన సంఘాలను కేసీఆర్ లేకుండా చేస్తున్నారని, అలా ఉద్యమాలు చేసే సంఘాలు లేకపోతే ఈరోజు కెసిఆర్ కు ఆ పదవి ఎక్కడిదని ప్రశ్నించారు. నియంత కేసీఆర్ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు త్వరలోనే వస్తాయని ఈటల రాజేందర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications