బీఆర్ఎస్ కు మరో షాక్: కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని ప్రకాష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇంట్లో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ప్రకాష్ గౌడ్ తోపాటు మరో ఇద్దరు మున్సిపల్ ఛైర్మన్లు కూడా హస్తం గూటికి చేరుతున్నట్లు తెలిసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలోనే కొందరు బీఆర్ఎస్ ఎంపీలు, నేతలు కాంగ్రెస్, బీజేపీల్లో చేరారు. ఆ తర్వాత వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. తాజాగా, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా హస్తం గూటికి చేరుతున్నారు. ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన.. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. మరోవైపు, 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ రాష్ట్ర మంత్రులు చెబుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications