జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరు: గవర్నర్ తమిళిసైకి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షమాపణలు
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్న కౌశిక్ రెడ్డి.. మంగళవారం ఢిల్లీలోని జాతీయ కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసైకి లిఖిత పూర్వక క్షమాపణలు చెబుతానని కౌశిక్ రెడ్డి మహిళా కమిషన్‌కు తెలిపారు.
అంతేగాక, క్షమాపణ పత్రం మహిళా కమిషన్ కు కూడా పంపుతానని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ఫిబ్రవరి 14న జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. లేదంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

గవర్నర్ తమిళిసై పట్ల పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మహిళా కమిషన్ ఈ నోటీసులు పంపింది. కాగా, గవర్నర్ తమిళిసై పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో బీసీ రాజకీయ జేఏసీ ఫిర్యాదు చేసింది. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదుకై డీజీపీ ఆదేశాలివ్వాలని.. జేఏసీ ఛైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ఎన్‌హెచ్ఆర్సీనీ కోరారు.
గవర్నర్ పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు
రిపబ్లిక్ వేడుకల సందర్భంగా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి గవర్నర్ తమిళిసై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో పాస్ చేసిన బిల్లులు, ఫైళ్లను గవర్నర్.. ఎందుకు దాచుకుంటున్నారని అనుచిత పదజాలాన్ని ఉపయోగించారు కౌశిక్ రెడ్డి. ఆ తర్వాత ఇది రాజ్యాంగా? అంటూ నిలదీశారు.
@NCWIndia held a hearing today in the matter of MLC Kaushik Reddy whom the Commission had sent a notice on the derogatory remarks made against Hon'ble Governor of Telangana Tamilisai Soundararajan. Mr Reddy appeared in person and apologized to the Commission. @sharmarekha pic.twitter.com/klPOwTC50e
— NCW (@NCWIndia) February 21, 2023
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై బీజేపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. కౌశిక్ రెడ్డిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి ఫిర్యాదు చేశారు. గవర్నర్ తమిళిసైపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications