రేవంత్‌రెడ్డి దెబ్బ.. నీరుగారిపోతున్న బీఆర్‌ఎస్.. కేసీఆర్‌కు పెద్ద కష్టమే!!
గులాబీ బాస్ కేసీఆర్ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి ఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలను కాపాడుకోవటం కేసీఆర్ కు పెద్ద కష్టమై పోయింది.
పక్క చూపులు చూస్తున్న నేతలను జంప్ కాకుండా చూడటం, నీరుగారిపోతున్న బీఆర్ఎస్ నాయకులను మళ్ళీ బలంగా ముందుకు తీసుకువెళ్లటం కేసీఆర్ కు తలకు మించిన భారంగా మారుతుంది. తెలంగాణా రాష్ట్రంలో పార్టీని దిద్ది ముందుకు నడిపించలేకపోతున్న కేసీఆర్ పార్టీని జాతీయ స్థాయిలో నడిపించటం కూడా కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఇది అర్ధం చేసుకున్న కేసీఆర్ ఈ క్రమంలోనే రానున్న లోక్సభ ఎన్నికలలో కేవలం తెలంగాణా నుండి మాత్రమే పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని కేసీఆర్ శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ అవకాశవాద రాజకీయాలలో నీవు నేర్పిన బాటే నీరజాక్ష అన్నట్టు గులాబీ పార్టీ నేతలు రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్ కాదంటే, దేశంలోని అధికార బీజేపీ వైపు చూస్తున్నారు. చేరికలకు రెడీ అవుతున్నారు.
గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు గంప గుత్తగా ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులను కేసీఆర్ ఏ విధంగా అయితే కారు ఎక్కించారో అదే విధంగా తాజాగా చాలా మంది కాంగ్రెస్ బాట పట్టటం కోసం సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో గత పాలన సమయంలో అక్రమాలపై రేవంత్ ఫోకస్ చేస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ నేతలు సేఫ్ గా ఉండాలని, కాస్త చేయి అందిస్తే జంప్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ కోసం పని చేస్తామని వచ్చిన నాయకులు కూడా కేసీఆర్ తాజా పరిస్థితి నేపధ్యంలో దుకాణం సర్దేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణా తర్వాత కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. కానీ మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పోటీలో ఉండే పరిస్థితి లేదని తేలటంతో మహా బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు షాకిచ్చే పనిలో ఉన్నారు. మొత్తంగా అన్ని వైపుల నుండి ప్రస్తుతం కేసీఆర్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications