పొంగులేటి - జూపల్లి పై బీఆర్ఎస్ వేటు..!!
బీఆర్ఎస్ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎంపీ పొంగులేటి..మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కొంత కాలంగా ఇద్దరు నేతలు బీఆర్ఎస్ అధినాయకత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆత్మీయ సమావేశాల పేరుతో పార్టీకి వ్యతిరేకంగా నేతలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ పార్టీలో చేరేదీ స్పష్టం చేయకపోయినా ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ ను వీడటం ఖాయమని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఖమ్మంలో ఇద్దరు నేతలు పార్టీ పైన చేసిన వ్యాఖ్యలతో వారిద్దరిపైన వేటు వేస్తూ నిర్ణయం ప్రకటించారు.
పొంగులేటి పై వేటు: మజీ ఎంపీ పొంగులేటి 2019 ఎన్నికల సమయం నుంచి పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కొత్తగూడెంలో నిర్వహించిన ఆత్మీయ సదస్సుకు రావాలని ఆహ్వానించారు.
జూపల్లి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టటం అసాధ్యమని తేల్చి చెప్పారు. కేసీఆర్ పాలన..నిర్ణయాలను ఇద్దరు నేతలు తప్పు బట్టారు. ఇప్పటి వరకు ఇద్దరి నేతల తీరు పైన వేచి చూసే ధోరణితో వ్యవహరించిన బీఆర్ఎస్ నాయకత్వం ఆ ఇద్దరినీ సస్పెండ్ చేసింది.

ఒక్కటవుతున్న అసంతృప్తులు: ఈ ఇద్దరు నేతలు పార్టీలోని ఇతర నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేది బీఆర్ఎస్ అభిప్రాయం. ఖమ్మంలో తనకు ప్రాధాన్యత దక్కటం లేదని చాలా కాలంగా పొంగులేటి ఆవేదన. పొంగులేటికి ఎమ్మెల్సీ ఇస్తారని భావించినా దక్కదలేదు. దీంతో, ఆయన బీజేపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ, పొంగులేటి ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరేది స్పష్టత ఇవ్వలేదు.
అందరి ఆమోదం..అంగీకారంతో పార్టీ నిర్ణయం ఉంటుందని స్ఫష్టం చేసారు. అదే సమయంలో జిల్లాలోని పది నియోజకవర్గాల్లోనూ తన అనుచర వర్గంతో పొంగులేటి వరుసగా సమావేశాలు నిర్వహించారు. వారంతా తనతో కొనసాగేలా మంతనాలు సాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సీఎం కేసీఆర్ - కేటీఆర్ లక్ష్యంగా పొంగులేటి ఆరోపణలు చేస్తున్నారు.

రాజకీయంగా అడుగులు ఎటు: ఇదే విధంగా జూపల్లి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తన మద్దతు దారులతో కొంత కాలంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మంత్రి కేటీఆర్ స్వయంగా మాట్లాడినా జూపల్లి తీరులో మార్పు రాలేదు. ఈ సమయంలో పొంగులేటితో జూపల్లి చేతులు కలిపారు.
ఎందరో అమరుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని జూపల్లి విమర్శలు చేసారు. తెలంగాణలో పాలన ఎప్పుడో గాడి తప్పిందని.. బీఆర్ఎస్ పేరుతో చెత్త పాలనను దేశానికి ఇవ్వాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ పరిణామాలతో ఇద్దరి పైన సస్పెన్షన్ వేటు పడటంతో..ఇప్పుడు ఈ ఇద్దరి నేతల భవిష్యత్ రాజకీయ అడుగులు ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications