వారిని ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం - కేటీఆర్ హెచ్చరిక..!!
తెలంగాణలో మున్సిపల్ పోరు పతాక స్థాయికి చేరింది. ప్రచారం ముగియటంతో ఇక పోలింగ్ పైన పార్టీలు ఫోకస్ చేసాయి. మూడు ప్రధాన పార్టీలు హోరా హోరీగా తలపడుతున్నాయి. పుర పోరు లో సత్తా చాటేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. రాజకీయంగా ఒకరిని మరొకరు టార్గెట్ చేస్తూ .. మాటల యుద్దం చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. కాగా, తాజాగా కాంగ్రెస్ ముఖ్య నేతలకు కేటీఆర్ చేసిన తాజా హెచ్చరిక సంచలనంగా మారుతోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని కేటీఆర్ విమర్శించారు. రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ వెంటపడుతూనే ఉంటామని తేల్చి చెప్పారు. అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

ఎన్నికల్లో గెలిస్తే కల్యాణలక్ష్మీ డబ్బులతో పాటు తులం బంగారం ఇస్తానని అబద్ధాలు చెప్పిండని అన్నారు. కానీ ఇప్పుడు మొఖం బాగోలేక అద్దం పగులగొట్టినట్లుగా రేవంత్ రెడ్డి తీరు ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్‌లోనే రైతుబంధు పడేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా రైతుబంధు ఎందుకు రావడం లేదని కేటీఆర్ నిలదీసారు.
హామీలు అమలు చేయాల్సిందే
భూపాలపల్లి జిల్లాను రద్దు చేయనని రేవంత్ రెడ్డి అంటున్నాడని కేటీఆర్ తెలిపారు. భూపాలపల్లి జిల్లాను తెచ్చింది అభివృద్ధి చేసింది కేసీఆర్ అని తెలిపారు. సింగరేణి కాంట్రాక్టులను రేవంత్ రెడ్డి తన బామ్మర్దికి కట్టబెట్టిండని పేర్కొన్నారు. బొగ్గు కుంభకోణం బయటపెట్టామని ఫేక్ నోటీసు లు ఇచ్చారని తెలిపారు. ఓటుకు నోటు కేసులో ఆధారాలు ఉండకూడదని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నిప్పు పెట్టి తగులబెట్టారని మండిపడ్డారు.
తెలంగాణను ఆగం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలని గల్లా పట్టుకుని అడగండని ఓటర్లకు పిలుపునిచ్చారు. తులం బంగారం ఎప్పుడిస్తావని అడగాలన్నారు. రేవంత్ రెడ్డికి ఓటుతోనే కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు. బూతుల ముఖ్యమంత్రికి పోలింగ్ బూత్‌లోనే బుద్ధి చెప్పాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి అన్ని వార్డుల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు.












Click it and Unblock the Notifications