జగన్‌కు దెబ్బ: రేపే టీడీపీలోకి రేణుక?, బెడిసికొట్టిన వ్యూహం.. స్వయంకృతాపరాధమే?
రేణుక టీడీపీలో చేరితే.. ఆమె తర్వాత మరిన్ని వలసలకు బీజం పడ్డట్టే. జగన్ ఈ అవకాశం టీడీపీకి ఎందుకిచ్చారో ఆయనకే తెలియాలి.
Recommended Video

అమరావతి: ఊహించినట్లుగానే రాయలసీమ కేంద్రంగా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైనట్లు కనిపిస్తోంది. కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకోవడంతో దీనికి బలం చేకూరింది.
బుట్టా రేణుక పార్టీ మార్పు అంశం ఊహాగానమే అనుకున్నప్పటికీ.. విశ్వసనీయ వర్గాలు మాత్రం టీడీపీలో ఆమె చేరిక ఖాయమంటున్నాయి. మంగళవారం ఆమె టీడీపీలో చేరడం ఇక లాంఛనమే అంటున్నారు.

బుట్టా రేణుక నేపథ్యం:
బీసీ సామాజిక వర్గానికి చెందిన రేణుక.. 2014 ఎన్నికల్లో మొదటిసారి కర్నూలు ఎంపీగా గెలిచారు. ఆమె వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. రేణుక భర్త నీలకంఠం కొంతకాలం క్రితం టీడీపీలో చేరి.. తిరిగి వైసీపీ గూటికే వచ్చారు.

జగన్-రేణుక మధ్య చర్చ
వైసీపీ నేతల ఫిరాయింపులపై ఇటీవల వార్తలు రావడంతో అప్రమత్తమైన జగన్.. వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో వలసలకు బ్రేక్ పడుతుందనే అంతా అనుకున్నారు. జగనే స్వయంగా రంగంలోకి దిగిన తర్వాత నేతలు వెనక్కి తగ్గకుండా ఉంటారా? అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కానీ వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకను జగన్ ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరారట. కర్నూలు ఎంపీ టికెట్ నే మళ్లీ ఆశిస్తున్న రేణుక మాత్రం అందుకు అంగీకరించలేదట. తనకు కర్నూలు నుంచే మరోసారి టికెట్ కావాలని స్పష్టం చేశారట.

అనుకూలంగా మలుచుకున్న టీడీపీ
రేణుక ప్రతిపాదనపై జగన్ నుంచి ఎలాంటి హామి రాకపోవడంతో.. పార్టీలో కొనసాగడంపై రేణుక ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ నుంచి ఆమెకు భరోసా లభిస్తున్న సంకేతాలు వస్తుండటంతో పార్టీ మార్పుకే ఆమె మొగ్గుచూపుతున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు.. టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో రేణుకకు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. అందువల్లే ఆమె వైసీపీని వీడి టీడీపీకి చేరుతున్నట్లు సమాచారం.
కర్నూలు జిల్లాలోని రెండు ఎంపీ సీట్లలో ఒకటి బీసీలకు, మరొకటి ఓసీలకు ఇచ్చే ఆనవాయితీని టీడీపీ కొనసాగిస్తోంది. దీంతో రేణుక ఆశిస్తున్నట్లు టీడీపీ ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించవచ్చు. వచ్చే ఎన్నికల్లోను ఆ టికెట్ బీసీలకే ఇవ్వాలని టీడీపీ భావిస్తుండటం రేణుక చేరికకు బలాన్నిస్తోంది. రేణుక గనుక టీడీపీలో చేరితే మొత్తం ముగ్గురు ఎంపీలు వైసీపీని వీడినట్లవుతుంది.

జగనే అవకాశమిచ్చినట్టు?:
కర్నూలు జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ.. రాను రాను తన పట్టు కోల్పోతున్నట్లే కనిపిస్తోంది. బుట్టా రేణుక విషయంలో మాత్రం జగన్ చేజేతులా నష్టాన్ని కొనితెచ్చుకున్నట్లే అనిపిస్తోంది. లేని దాని కోసం ఆరాటపడి ఉన్న ఎంపీని పోగొట్టుకోవడంలో జగన్‌ను ఎలా అర్థం చేసుకోవాలో ఆ పార్టీ నేతలకే అర్థం కావడం లేదు.
ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుకను పోటీ చేయించడం ద్వారా అక్కడ కూడా టీడీపీకి చెక్ పెట్టాలని జగన్ భావించారు. ఒకవేళ అక్కడి నుంచి రేణుక పోటీ దిగి ఉంటే గెలుపు అవకాశాలు ఎంతమేర ఉండేవో తెలియదు కానీ, కర్నూలు నుంచి పోటీ చేస్తే మాత్రం రెండోసారి గెలుస్తానన్న ధీమాలో ఆమె ఉన్నారు.
జగన్ రేణుక మాటను అంతగా లెక్కలోకి తీసుకోకపోవడం వల్లే ఇప్పుడామె పార్టీ మారాల్సిన పరిస్థితి. రేణుక టీడీపీలో చేరితే.. ఆమె తర్వాత మరిన్ని వలసలకు బీజం పడ్డట్టే. జగన్ ఈ అవకాశం టీడీపీకి ఎందుకిచ్చారో ఆయనకే తెలియాలి. మొత్తం మీద జగన్ వ్యూహం దారుణంగా బెడిసి కొట్టిందనే చెప్పాలి.












Click it and Unblock the Notifications