రేవంత్ రెడ్డి డ్రైవర్, పిఎ తప్పించుకుంటున్నారు: ఎసిబి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి వాహనం డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు (పిఎ) విచారణను తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) తెలిపింది. కోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో ఎసిబి ఆ విషయం చెప్పింది. నోటుకు ఓటు కేసులో వారిద్దరు కీలక సాక్షులని తెలిపింది.
వచ్చే 20 ఏళ్లలో తాను రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర పోషిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారని, అందువల్ల సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎసిబి స్పెషల్ ప్రాసిక్యూటర్ వి. సురేందర్ రావు అన్నారు. కేసులో దర్యాప్తు పెండింగులో ఉందని, ఎసిబికి మరిన్ని వివరాలు అందాయని, మరింత దర్యాప్తు అవసరమని, ఎసిబి ప్రస్తుతం డబ్బుపై దర్యాప్తు చేస్తోందని ఆయన అన్నారు.

కేసులో కీలకమైన సాక్ష్యాలైన ఆడియో - వీడియో రికార్డింగులను, మొబైల్ ఫోన్లను ఇంకా ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాల్సి ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు ఎల్వీస్ స్టీఫెన్‌సన్, ఆయన కూతురు జెస్సికా స్టీఫెన్‌సన్, అనుచరుడు మాల్కం టైలర్‌ల వాంగ్మూలాలను ఎసిబి రికార్డు చేయాల్ిస ఉంది.
నోటుకు ఓటు కేసులో ఎసిబి కోర్టు రేవంత్ రెడ్డికి 12 గంటల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గురువారంనాడు తన కూతురు నైమిశ నిశ్చితార్థానికి హాజరయ్యారు. గురువారం సాయంత్రం ఆయన తిరిగి లొంగిపోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications