సృష్టికర్త! ఘనతంతా చంద్రబాబుదే: కేటీఆర్ షాకింగ్ కామెంట్స్, అమరావతిపైనా..
Recommended Video

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడినా.. హైటెక్ సిటీ, సైబరాబాద్ లేకుండా ఆయన ప్రసంగం ముగిసిపోదు. తానే ఐటీని హైదరాబాద్‌కు తీసుకొచ్చానని ఎన్నోసార్లు ఆయన చెప్పుకున్న విషయం తెలిసిందే.
అందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ఆయనపై విమర్శలు కూడా వస్తుంటాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలకు అమితమైన ప్రాధాన్యత లభించింది.

ఆ ఘనత చంద్రబాబుదే..
ఇంతకీ అసలు విషమేంటంటే.. ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు.

అంతా చంద్రబాబుకే
‘ప్రపంచంలో ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ను నిలపడంలో చంద్రబాబు కృషి అమోఘం. ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు హైదరాబాద్‌కు రావడంతో నా కృషి ఏమీ లేదు. ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకే దక్కుతుంది' అని కేటీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం. గురువారం హైటెక్స్ సిటీలో జరిగిన టెక్ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని, ఉపాధ్యక్షుడు ఏఎస్ మూర్తి, నాస్కామ్ ప్రెసిడెంట్ డేబ్జానీ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

హైదరాబాద్ ఎంతో మేలు
పలువురు ఐటీ ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. భవిష్యత్తులో హైదరాబాద్ నగర అభివృద్ధి ప్రణాళికలు, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనపై వివరించారు. బెంగళూరు, గురుగ్రామ్‌తో పోలిస్తే హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఐటీలో మేటీ
ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంన్నారు. టీహబ్-2 నిర్మాణ దశలో ఉందని చెప్పారు. ఐటీలో మేటి కంపెనీలు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయన్నారు. ‘ఉపాధి అవకాశాల్లో యువతకు శిక్షణ కోసం ఐటీని వాడుకుంటున్నం. పాఠశాల విద్యనుంచే శిక్షణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కాలేజీలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ఉపాధి, నైపుణ్య అభివృద్ధిలో యువతకు శిక్షణ ఇస్తున్నాం' అని కేటీఆర్ చెప్పారు.

ఒక్క రోజులు అంతా జరగలేదు.. అమరావతి కూడా..
17ఏళ్లలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయని కేటీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ ఒక్కరోజులో అభివృద్ధి చెందలేదని.. ఈ నగరానికి 450ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిరంతర కృషితో వెలుగుల తెలంగాణ సాధించామని, రెప్పపాటు కరెంట్ పోకుండా సరఫరా చేస్తున్నామని తెలిపారు. రైతులకు కూడా వచ్చే ఏడాది నుంచి 24గంటలపాటు కరెంట్ ఇస్తామని చెప్పారు. ఇంటింటికీ నీళ్లుఇవ్వాలనే మిషన్ భగీరథ తీసుకొచ్చామన్నారు. విశ్వనగరం విజన్‌తో ముందుకు వెళ్తున్నామని, వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications