కేసీఆర్ 'ఫ్రంట్' గాలి తీసిన బాబు: అబ్బే.. అదంతా ఇష్యూస్ డైవర్ట్ చేయడానికే?
హైదరాబాద్: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తుతానికైతే చర్చల దశలోనే ఉంది. ఇంతవరకూ ఆయన కలిసిన నేతలెవరూ ఫ్రంట్ తో కలిసి పనిచేస్తామని గట్టి హామి ఇవ్వలేకపోయారు. ఫ్రంట్ అంటున్నారు కాబట్టి.. పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబును కూడా కలుపుకుపోతారా? అని ప్రశ్నిస్తే.. ఆయన నా మిత్రుడే, ఆయనతోనూ చర్చిస్తామని చెప్పారు కేసీఆర్.

కేసీఆర్ మాటలు అలా ఉంటే.. చంద్రబాబు మాత్రం 'ఫ్రంట్'ను లైట్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఒక్క మాటలో ఆయన ఫ్రంట్ గాలి తీసేశారనే చెప్పాలి. శుక్రవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన టీటీడీపీ సమావేశంలో.. కేసీఆర్ ఫ్రంట్ పై ఆయన తీసికట్టుగా వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ఏమన్నారు?:
'ఫెడరల్ ఫ్రంట్ లేదు, ఏ ఫ్రంటూ లేదు. టీఆర్‌ఎస్‌లో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అంతర్గతంగా సమస్యలేమైనా ఉండవచ్చు. ఇదంతా ఇక్కడి సమస్యల నుంచి దృష్టి మళ్లించే ఎత్తుగడ' అని చంద్రబాబు టీటీడీపీ నేతలతో చెప్పారు. ఇప్పటికైతే తననెవరూ ఫ్రంట్ గురించి సంప్రదించలేదని, ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశారు.

బలోపేతం చేయండి:
'ఫ్రంట్ లు, పొత్తుల సంగతి పూర్తిగా పక్కనపెట్టండి. పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపైనే మీ దృష్టి కేంద్రీకరించండి. తెలంగాణలో త్రిముఖ పోటీ ఉంటుంది. తద్వారా టీడీపీకి కొన్ని అసెంబ్లీ స్థానాలు దక్కవచ్చు. సమస్యలపై పోరాడకుండా ప్రభుత్వంపై మెతకగా ఉండవద్దు. నాయకత్వ బాధ్యతల్లో ఉన్నవారికి పక్షపాతం అసలే వద్దు, గ్రూపు రాజకీయాలు పక్కనపెట్టండి, టికెట్ల సంగతి నేను చూసుకుంటాను, ముందుగానే ప్రకటిస్తాను' అని టీటీడీపీ నేతలతో చంద్రబాబు చెప్పుకొచ్చారు.

నేతలపై అసంతృప్తి:
రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు జనాల్లోకి వెళ్లడం లేదని, పార్టీ బలహీనంగా ఉంటే ఎవరూ పట్టించుకోరని చంద్రబాబు నేతలతో అన్నారు. పార్టీ తరుపున కార్యక్రమాలను ఉధృతం చేస్తేనే ఎవరైనా పొత్తులకు ముందుకు వస్తారని సూచించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు మారుతాయని, అప్పటిదాకా ఎన్నికల రాజకీయంపై ఒక అంచనాకు రాలేమని చెప్పారు.

బీజేపీతో సంబంధం లేదు:
బీజేపీతో పార్టీకి తెగదెంపులైపోయాయని భేటీలో చంద్రబాబు చెప్పినట్టుగా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జాతీయ మహానాడు ఉంటుందన్నారు. 24న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ మహానాడు నిర్వహిస్తామని, దీనికి చంద్రబాబు హాజరవుతారని వెల్లడించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!