ఆలేరులో బాబు పూజలు: సిఎస్‌కు రమణ లేఖ
వరంగల్: వరంగల్ పర్యటనకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నల్లగొండ జిల్లా ఆలేరులోని ఆలయంలో గురువారంనాడు పూజలు చేశారు. ఆయన గురువారం ఉదయం రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి వరంగల్‌కు బయలుదేరారు. ఆయన పర్యటనను అడ్డుకుంటామని ఎమ్మార్పీయస్ నాయకులు ప్రకటన చేసిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
కాగా, వరంగల్ జిల్లాలో జరిగిన ఘటనలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు, డీజీపీ అనురాగ్‌శర్మలకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్.రమణ లేఖ రాశారు. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వీరికి రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరి అండ ఉందని లేఖలో అరోపించారు. చంద్రబాబు పర్యటనకు పూర్తి భద్రతను కల్పించాలని కోరారు.

వరంగల్ జిల్లాలో చంద్రబాబు పర్యటనపై ముందస్తు సమాచారం ఇచ్చినా పోలీసులు ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామని ఎల్.రమణ అన్నారు. చంద్రబాబు పర్యటనకు కొన్ని శక్తులు ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఇదిలావుంటే, చంద్రబాబు వరంగల్ జిల్లా పర్యటన సందర్బంగా ఎమ్మార్పీయస్ కార్యకర్తలపై దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సామ్యూల్, ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు. ఉప్పల్ నుంచి వరంగల్ వరకు 12 చోట్ల దాడులు జరిగాయని వారు గురువారం చెప్పారు. ఈ ఘటనకు చంద్రబాబు, టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు బాధ్యత వహించాలని వారన్నారు.












Click it and Unblock the Notifications