ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్
గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే, సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర రెండో కుమార్తె నాగసాయి వైదీప్తి - కెవిన్ రామ్‌ల వివాహ వేడుక బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ శుభకార్యానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయాలకు అతీతంగా ఇద్దరు సీఎంలు ఒకే వేదికపై కనిపించడం విశేషం.
ఈ వివాహ వేడుకకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుతో పాటు మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, దేవినేని ఉమామహేశ్వరరావు, వేం నరేందర్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మర్యాదపూర్వక స్వాగతం పలికారు.

నరేంద్ర కుమార్తెకు లోకేశ్ ఆఫర్..
పెళ్లి వేడుకలో రాజకీయ చర్చలు పక్కన పెట్టి నాయకులంతా సరదాగా గడిపారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె మధ్య జరిగిన సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం లోకేశ్ నరేంద్ర కుమార్తెతో మాట్లాడుతూ.. "త్వరలో మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయి.. నువ్వు ఎమ్మెల్యే అవ్వడానికి రెడీగా ఉండు" అంటూ చలోక్తి విసిరారు.
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర రెండో కూతురు పెళ్లిలో సరదా సన్నివేశం
— DONTHU RAMESH (@DonthuRamesh) March 25, 2026
మహిళా రిజర్వేషన్ వస్తుంది రెఢీగా ఉండు అంటూ నరేంద్ర కూతురికి చెప్పిన మంత్రి నారా లోకేష్.
మాకే ఎర్త్ పెడితే ఎలా బాబూ అన్న నరేంద్ర. pic.twitter.com/1WtXbopn7V
దీనికి ధూళిపాళ్ల నరేంద్ర వెంటనే స్పందిస్తూ.. "మాకే ఎర్త్ పెడితే ఎలా బాబూ?" అంటూ నవ్వుతూ రియాక్ట్ అయ్యారు. పక్కనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఈ సరదా సంభాషణకు పగలబడి నవ్వారు. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు వంటి అంశాలపై కూడా నాయకుల మధ్య అనధికారికంగా చర్చలు జరిగినట్లు సమాచారం. వివాహ వేడుక అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు తిరుగుపయనమయ్యారు.












Click it and Unblock the Notifications