కాంగ్రెస్ లో డజను మంది ముఖ్యమంత్రులు: కాంగ్రెసోళ్ళతో తెలంగాణా ఆగం: సీఎం కేసీఆర్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొంటూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా ఈరోజు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోను, నల్గొండ జిల్లా మిర్యాలగూడ, దేవరకొండ లోనూ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు.
హుజూర్ నగర్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని, 90 స్థానాలను తాము గెలుచుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో డజను మంది ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని గెలిస్తే కొట్టుకోవడం తప్ప చేసేదేమీ లేదంటూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ ఆగమైందని, కాంగ్రెస్ హయాంలో సాగర్ చివరి భూములకు నీళ్లు కూడా రాలేదని అన్నారు. ఉద్యమ సమయంలో తాము నీళ్ల కోసం కొట్లాటలు, పాదయాత్రలు చేశామని గుర్తుచేశారు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు లు పట్టుబట్టి దామరచర్ల లో యాదాద్రి పవర్ ప్లాంట్ ను మంజూరు చేయించడం వల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయని అన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి అనాలోచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారనీ, రైతు బంధు అనవసరం, 3 గంటల విద్యుత్ చాలు అంటూ రైతు వ్యతిరేక విధానాలు చెప్తున్నారని అన్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు ఏ రోజు నీటి కోసం పోరాడ లేదని పేర్కొని, నాడు కాంగ్రెస్ మంత్రులలో ఒక్క మగాడు లేకుండెనా అంటూ కెసిఆర్ ఫైరయ్యారు.
అలాంటివారికి బుద్ధి చెబుతూ ప్రజల మంచికోరే పార్టీలను గెలిపించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. అనంతరం దేవరకొండలో జరిగిన సభ లో పాల్గొన్న సీఎం అక్కడి గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం తమ ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్. గా ఉందని... అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications