మల్లన్న సాగర్‌ను జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్.. ప్రాజెక్టు ప్రత్యేకలు ఇవే..!!
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కొమురవెల్లి మల్లన్న సాగర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 50 టీఎంసీల సామర్థ్యంలో నిర్మించిన ఈ జలశయాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం భూగర్భంలో ఏర్పాటు చేసిన పంప్ హౌస్ లో మోటర్లను ప్రారంభించి.. జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మల్లన్నసాగర్ జాతికి అంకితం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ అని సీఎం కేసీఆర్ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన.. ఈ జలాశయం ద్వారా సుమారు 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు మల్లన్న సాగర్ వరప్రదాయినిగా మారనుందని ఆనందం వ్యక్తం చేశారు. పల్లెలు పంటలతో కళకళలాడుతాయన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం
ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం . గోదావరి జలాలను ఎత్తిపోసి 10 జిల్లాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. ఇందులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయం తెలంగాణకు గుండెకాయ వంటింది. అత్యంత ఎత్తు, అత్యధిక నీటి నిల్వ సామర్థ్యమున్న ప్రాజెక్టు ఇది. ఈ జలాశయానికి 5 ఓటీ స్లూయిస్ లు ఉన్నాయి. ఈ తూముల ద్వారానే సింగూరు ప్రాజెక్టుకు, కొండపోచమ్మ, గంధమల్ల , తుపాస్ పల్లి రిజర్వాయర్ కు, మిషిన్ భగీరథకు నీటిని తరలిస్తారు.
అత్యంత ఎత్తులో మల్లన్న సాగర్ జలాశయం
మల్లన్నసాగర్ జలాశయం సుమారు 7041.32 కోట్ల అంచనాతో ప్రారంభించి పూర్తి చేశారు. దీని ఎఫ్ఆర్ఎల్ 557 మీటర్లు, ఎండ్యూఎల్ 562 మీటర్లు. దీంతో మెదక్, రంగారరెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా నీటిని తరలిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 8.33 ఎకరాలకు గ్రావిటీ ద్వారానే నీటిని అందించే అవకాశం ఉంది. హైదరాబాద్ ప్రజల తాగునీటి కోసం భవిష్యత్తులో 30 టీఎంసీల నీటిని కేటాయించనున్నారు..

ముంపు ప్రాంతాలకు న్యాయం
ఈ ప్రాజెక్టు కింద ముంపునకు గురైన ప్రాంతాలకు న్యాయం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు ఇవ్వనటువంటి పరిహారం ఇచ్చామని తెలిపారు. ప్రతిపక్షాల కుట్రలను చేదిస్తూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. వారి పిచ్చి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. భూములు కోల్పోయిన వారి త్యాగాలు వెలకట్టలేదనిదని పేర్కొన్నారు. ఆసియా ఖండంలోనే ఎక్కడా లేదని విధంగా పునరావాస కాలనీలను కట్టించామని చెప్పారు. నిర్వాసితులకు కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టి వారందరికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.